Jayanthi : స్త్రీ పక్షపాతి… క్రాంతి కుమార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత క్రాంతికుమార్ మహిళా పక్షపాతిగా సాగారు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, దర్శకత్వం వహించిన సినిమాల్లోనూ మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపించడమే కాదు, సమాజాన్నీ ఆలోచింపచేసేవారు. అందుకే క్రాంతికుమార్ ను చాలామంది ‘వెండితెర చలం’ అంటూ కీర్తించారు. నిర్మాతగా క్రాంతికుమార్ తొలి చిత్రం ‘శారద’లోనూ, దర్శకునిగా చివరి చిత్రం ‘9 నెలలు’లోనూ మహిళా పక్షపాతిగానే నిలిచారు. తాను నిర్మించిన కమర్షియల్ మూవీస్ లోనూ మహిళల సమస్యలను అంతో ఇంతో చర్చించడానికే తపించేవారు.

Also Read
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
తలశిల క్రాంతికుమార్ 1942 మే 4న పెనమలూరులో జన్మించారు. సంపన్న కుటుంబంలో జన్మించడం వల్ల సరదాగా చదువుకుంటూనే పుస్తకాల పట్ల మమకారం పెంచుకున్నారు. మిత్రులతో కలసి సినిమాలు చూసి, వాటి గురించి చర్చిస్తూ కాలం గడిపేవారు. తరువాత ఆయన మిత్రుడు పి.రాఘవరావు నిర్మించిన ‘శారద’తో చిత్రసీమలో అడుగుపెట్టారు. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మగువల మానసిక సంఘర్షణను రూపొందించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత క్రాంతికుమార్ నిర్మాణంలో వెలుగు చూసిన “ఊర్వశి, జ్యోతి, కల్పన, ఆమెకథ, ప్రాణం ఖరీదు” వంటి చిత్రాలలోనూ మహిళల పలు విలక్షణమైన సమస్యలకు తెరతీశారు. అయితే అవేవీ క్రాంతి కుమార్ కు అంతగా కాసులు తీసుకురాలేదు. యన్టీఆర్ హీరోగా దాసరి దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘సర్దార్ పాపారాయుడు’ అఖండ విజయం సాధించింది. నిర్మాతగా క్రాంతికుమార్ కెరీర్ లో మళ్ళీ అలాంటి సినిమా రాలేదనే చెప్పాలి. తరువాత ఆయన నిర్మించిన ‘న్యాయం కావాలి’లోనూ మగవాడి మోసానికి బలై పోయిన మగువ చేసిన పోరాటాన్ని ప్రధానాంశంగా చూపించారు. ఈ చిత్రంతోనే రాధిక తెలుగు తెరకు పరిచయం కాగా, చిరంజీవికి నటునిగా ఈ సినిమా మంచి గుర్తింపు సంపాదించిపెట్టింది. చిరంజీవితో క్రాంతి కుమార్ “మోసగాడు, కిరాయిరౌడీలు, ఇది పెళ్ళంటారా,శివుడు శివుడు శివుడు, అగ్నిగుండం, రిక్షావోడు” వంటి చిత్రాలను నిర్మించారు.

నిర్మాతగా ఇతరుల దర్శకత్వంలో పలు చిత్రాలు తీసిన క్రాంతికుమార్ ‘స్వాతి’ చిత్రంతో దర్శకుడయ్యారు. ఇక్కడా స్త్రీపక్షపాతిగానే సాగారు. ఇందులో నడివయసు తల్లికి ఓ పడచుపిల్ల మళ్ళీ పెళ్ళి చేయడం అప్పట్లో వింతగా చెప్పుకున్నారు. అయితే ‘స్వాతి’ చిత్రాన్ని మహిళలు విశేషంగా ఆదరించారు. తరువాత క్రాంతి దర్శకత్వంలో రూపొందిన ‘స్రవంతి’ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలకు రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులు లభించడం విశేషం. చిరంజీవి హీరోగా ‘అగ్నిగుండం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నాగార్జున హీరోగా ‘అరణ్యకాండ, నేటి సిద్ధార్థ” తెరకెక్కించారు. ఇవేవీ జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. తరువాత రాజశేఖర్ తో తీసిన ‘అక్కమొగుడు’ ఆదరణ పొందింది. “అమ్మకొడుకు, భలే పెళ్ళాం, సరిగమలు, పాడుతా తీయగా, అరుంధతి, 9 నెలలు”వంటి చిత్రాలు కూడా క్రాంతి కుమార్ దర్శకత్వంలో వెలుగు చూశాయి. కానీ, ఇవేవీ కమర్షియల్ గా అంత విజయాన్ని చవిచూడలేదు. ఏయన్నార్ ప్రధాన పాత్రధారిగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో వి.ఎమ్.సి. దొరస్వామి రాజు నిర్మించిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ మంచి విజయాన్ని చవిచూసింది. ‘స్వాతి’ తరువాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో అంత పెద్దవిజయాన్ని చూసింది ‘ సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రమే! కృత్రిమ గర్భధారణ, సరోగసీ మాతృత్వంపై ‘9 నెలలు’ చిత్రం తెరకెక్కించారు. సౌందర్య, విక్రమ్ జంటగా నటించిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏది ఏమైనా తన చిత్రాలలో స్త్రీమూర్తుల పక్షాన నిలచి, వారి మనసు గెలిచారు క్రాంతి కుమార్.
తాజావార్తలు
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!