చెన్నై ఇంజంబక్కంలో నివసిస్తున్న నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ ఇల్లు ప్రస్తుతం పెద్ద వివాదాల్లో చిక్కుకుంది. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకున్నప్పటికీ, నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో మొత్తం రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు పెరిగినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు ఇప్పటికే అనేకసార్లు రిమైండర్ లేఖలు పంపినా ఫలితం లేకపోవడంతో చివరికి ఇంటి గోడలకు నోటీసులు అంటించి, ఆ ఇంటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
Also Read : Bhootam Pretham : జబర్దస్త్ బ్యాచ్ భూతం ప్రేతం అంటున్నారే!
మరోవైపు జయం రవి పేరు ఇటీవల సినిమా ఒప్పందాల వివాదంలోనూ వినిపించింది. టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ ఆయన పై ఆరోపణలు చేస్తూ, రెండు సినిమాలకు సుమారు రూ.6 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నటించకుండా ఇతర సినిమాలకు ఒప్పుకున్నారని వెల్లడించింది. ఈ కారణంగా ఆ సంస్థ కూడా ఆయన ఇంటిని జప్తు చేయాలని డిమాండ్ చేసింది. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజ్ పెంచుకున్న జయం రవి ప్రస్తుతం ఈ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ ఆరోపణలపై జయం రవి ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. మరి ఈ వ్యవహారం ఏ దిశగా వెళ్తుందో, ఆయన తన బకాయిలను క్లియర్ చేస్తారా లేదా అనేది చూడాలి.