ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్; ప్రముఖ నటి, నిర్మాత శ్రీదేవి, బోనీకపూర్ల కుమార్తె జాన్వీ కపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ‘బవాల్’. ఈ క్యూట్ లవ్ స్టోరీని ‘దంగల్’, ‘చిచ్చోరే’ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య లక్నోలో మొదలైంది. ఓ పట్టణానికి చెందిన కుర్రాడు, తమ ఊరికే చెందిన ఓ అందమైన అమ్మాయిని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని కలలుకంటూ ఉంటాడు. అందుకోసం అతను చేసిన హంగామా ఏమిటనేదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ పోలెండ్ లో జరుగుతోంది. హీరోహీరోయిన్లు వరుణ్ ధావన్, జాన్వీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇండియాతో పాటు ఐదు యూరప్ దేశాలలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 7న ‘బవాల్’ మూవీ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఇప్పుడు తమిళ రీమేక్ ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్ ‘గుడ్ లక్ జెర్రీ’లో నటించింది. అది ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాస్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ఆమె మలయాళ చిత్రం ‘హెలెన్’ హిందీ రీమేక్ ‘మిలి’లోనూ నటించింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. రాజ్ కుమార్ రావ్ తోనూ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ జాన్వీ చేస్తుంది. ఇక వరుణ్ ధావన్ విషయానికి వస్తే, కృతీసనన్ తో కలిసి అతను నటించిన హారర్ ఫిల్మ్ ‘భేడియా’ ఈ యేడాది నవంబర్ 25న విడుదల కాబోతోంది. మరి తొలిసారి సిల్వర్ స్క్రీన్ మీద ‘బవాల్’తో జతకడుతున్న వరుణ్, జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.