కోలీవుడ్ స్టార్ హీరో నటించిన “జై భీమ్” చిత్రం సృష్టించిన సంచలనం, రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రశంసలతో పాటు సినిమాపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్నియార్ వర్గాన్ని కించపరిచారంటూ సూర్యను చంపేస్తామని బెదిరించారు కూడా. అయితే “జై భీమ్” మాత్రం వాటన్నింటినీ దాటేసి ఏకంగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ కు నామినేట్ అవ్వడం విశేషం. అయితే ఇప్పడు ‘జై భీమ్’ మరోసారి ట్రెండ్ అవ్వడానికి కారణం అది కాదు. ఓ మహానాయకుడిని తలచుకుంటూ ‘జై భీమ్’ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమాకు, ఆ నాయకుడికీ సంబంధం ఏమిటంటే… ఆయన పేరు కూడా ‘భీమ్’ కాబట్టి.
Read Also : “రాధేశ్యామ్” హిందీ సెకండ్ సింగిల్ టీజర్
న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, మహిళలు, దళితులు, మైనారిటీల కోసం పోరాడిన వ్యక్తి. మన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ వర్ధంతి నేడు. అంబేద్కర్ బడుగు వర్గాల కోసం చేసిన కృషి అనంతం, అజరామరం. డాక్టర్ అంబేద్కర్ మనల్ని శాశ్వతంగా విడిచి పెట్టి 65 సంవత్సరాలు అవుతోంది. ఆయన ఆలోచనలు ఇప్పటికీ జీవించే ఉన్నాయి. ప్రజానీకాన్ని నడిపిస్తున్నాయి. అంటరాని వారి పట్ల సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, స్త్రీలు, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్తగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన 65వ వర్ధంతి సందర్భంగా అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
రీసెంట్ గా వచ్చిన “జై భీమ్” సినిమాలోనూ అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చడానికి హీరో తన శక్తిమేరా ప్రయత్నిస్తాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మనసుని కదిలించింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. నేడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనను తలచుకుంటూ “జై భీమ్”ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక పేదలకు ఎలాంటి అన్యాయం జరిగినా తెరపైకి ‘జై భీమ్” పేరునే తీసుకొస్తున్నారు.