కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్ లో యాంకర్ సూటిగా సుదీప్ నే ప్రశ్నించింది. ‘అక్కడకు వచ్చి, ఇక్కడకు జాక్వెలిన్ రాకపోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా?’ అని అడిగింది. దానికి సుదీప్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ‘మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కూ జాక్వెలిన్ వస్తే బాగానే ఉండేదని, కానీ ఇప్పటికే తమ బడ్జెట్ దాటిపోయిందని, ఇప్పుడు మొత్తం ఖర్చు ప్రమోషన్స్ మీదనే పెడుతున్నామ’ని అన్నాడు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జాక్వెలిన్ కోసం నిర్మాత జాక్ మంజునాథ్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. ఆమెకోసం, ఆమె స్టాఫ్ కోసం సకల సౌకర్యాలు కలిగించడానికి డబ్బులను నీళ్ళులా ఖర్చు పెట్టారని వార్తా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ప్రమోషన్స్ సమయంలో మరోసారి ఆమె కోసం భారీ ఖర్చును భరించలేకే స్వస్తి పలికారని అంటున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సల్మాన్ ఖాన్ కూడా ముందుకు వచ్చారని, హైదరాబాద్ కూ ఆయన రావాలని అనుకున్నారని, అయితే ప్రొటోకాల్ కారణంగా పబ్లిక్ మీటింగ్స్ కు ఆయన హాజరుకాలేకపోయారని కిచ్చా సుదీప్ వివరణ ఇచ్చారు. ‘విక్రాంత్ రోణ’ హిందీ వర్షన్ కు సల్మాన్ ఖాన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు