Punch Prasad: బుల్లితెర కామెడీ షోలు చూసేవారికి కమెడియన్ ప్రసాద్ గురించి తెలియకపోవచ్చు. అదే జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ అనగానే టక్కున గుర్తొచ్చేస్తాడు. దశాబ్దం నుంచి పంచ్ ప్రసాద్ బుల్లితెర కామెడీ షోలలో తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్నాడు. అయితే ఆ నవ్వు అతని జీవితంలో మాత్రం లేదు.. ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని అందరికి తెలుసు.. ఈ విషయాన్నీ కూడా ప్రసాద్ కామెడీగానే అందరికి చెప్పుకొచ్చాడు. దాని మీదే పంచులు వేసి నవ్వించాడు. ఇక మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కామెడీని మాత్రం వదలలేదు. వరుస షోలలో కనిపిస్తూ నవ్విస్తూనే ఉన్నాడు. అయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం అంతకంతకు క్షిణీస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా ప్రసాద్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చెప్పుకొచ్చాడు.
ప్రసాద్ భార్య ఈ వీడియోను అతనికి తెలియకుండా తీయడంతో అతని ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని ప్రేక్షకులకు తెల్సింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ “ఒకరోజు షూటింగ్ నుంచి వచ్చాక ఫీవర్ గా ఉందన్నారు. ఆ తరువాత నడుమునొప్పి అన్నారు.. కూర్చున్న మనిషి లేవలేక ఎంతో బాధపడ్డారు. వెంటనే డాక్టర్స్ కు చూపిస్తే వారు కూడా ముందు ఏమైందో చెప్పలేదు.. ఆ తరువాత టెస్ట్ చేస్తే.. కుడికాలి కింద నుంచి వెన్నుపూస వరకు చీము పట్టిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వైద్యం చేయిస్తున్నాము.. దేవుడి దయవలన నా భర్త త్వరగా కోలుకోవాలి “అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన వారికి కూడా పంచ్ ప్రసాద్ పడుతున్న బాధను చూస్తే కంటనీరు రాక మానదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పంచ్ ప్రసాద్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుపుతున్నారు.