కళాకారులను గౌరవిస్తూ, వారి వాక్కు సైతం పెద్దల సభలో వినిపించాలని ఎప్పటి నుంచో రాజ్యసభకు పలువురు కళాకారులను నామినేట్ చేస్తూ వస్తున్నారు. `ఇసైజ్ఞాని` ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల యావత్ భారత సినీరంగం హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళనాట జన్మించినా, తెలుగువారి సినిమాలకు సైతం మరపురాని, మరచిపోలేని మధురామృతం అందించారు ఇళయరాజా. ఆయన స్వరకల్పనలో రూపొందిన చిత్రాలతోనే ఎందరో తమిళనాట స్టార్స్ గా సక్సెస్ రూటులో సాగారు. ఇక తెలుగులోనూ ఇళయరాజా బాణీలు 1978 ప్రాంతం నుండే అలరిస్తూ వస్తున్నాయి. యన్టీఆర్ `యుగంధర్` చిత్రానికి స్వరకల్పన చేసి, విశేషంగా అలరించిన ఇళయరాజా ఆ పై చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోస్ అందరికీ మ్యూజికల్ హిట్స్ అందించారు. ఇళయరాజాకు జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డులు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు `సాగరసంగమం, రుద్రవీణ` తెలుగు చిత్రాలు కావడం విశేషం! ఇక తెలుగునాట ఆయనను అనేక నంది అవార్డులు వరించాయి. తమిళ, కన్నడ, మళయాళ సీమల్లోనూ ఇళయరాజా బాణీలకు జనం జేజేలు పలికారు. ఉత్తరాదిన ఎందరో సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలను అనుకరిస్తూ స్వరాలు పలికించి, విజయం సాధించారు. ఇక స్వయంగా ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన హిందీ చిత్రాలు ఉత్తరాది వారిని విశేషంగా అలరించాయి.
ఇప్పటికే పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు పొందిన ఇళయరాజాకు ఇప్పుడు గౌరవంగా రాజ్యసభకు నామినేట్ కావడం అభినందనీయం. ఇళయరాజా వంటి సంగీతజ్ఞానికి కళలు, సంస్కృతీసంప్రదాయాల పట్ల ఎంతో అవగాహన ఉందని, అలాంటి రాజా కళారంగం తరపున పెద్దల సభలో తన పలుకు వినిపిస్తారనీ అందరూ ఆశిస్తున్నారు. తనకు నచ్చని దానిని నిర్మొహమాటంగా చెప్పడం, నచ్చిన వాటిని ఎంతగానో కొనియాడడం ఇళయరాజా నైజం. రాజ్యసభలోనూ ఇళయరాజా తనదైన పంథాలో సాగుతారని చెప్పవచ్చు. రాజ్యసభ సభ్యునిగా తన ఆరేళ్ళ పదవీకాలంలో ఇళయరాజా ఏం మాట్లాడబోతారో అని ఇప్పటి నుంచే ఆయన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తుతూ ఉండడం విశేషం!