17 ఏళ్ళ కెరీర్… 7 సినిమాలు. వాటిలో రెండు కన్నడ చిత్రాలు. తెలుగులో ఐదు సినిమాలు. కన్నడలో రెండు సినిమాలు బాగా ఆడినవే. అయితే తెలుగులో తీసిన ఐదు సినిమాలూ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈ ఉపోద్ఘాతం అంతా దర్శకుడు మెహర్ రమేశ్ గురించే. దాదాపు 9 సంవత్సరాల తర్వాత మెహర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టాడు. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయింది. తమిళ సూపర్ హిట్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’. తమన్నా నాయిక. దీనిని అనిల్ సుంకరతో కలసి కె.యస్. రామారావు నిర్మిస్తున్నారు. మరి ఇప్పటి వరకూ తెలుగులో హిట్ లేని మెహర్ కి మెగా టచ్ కలసి వస్తుందా!?
పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడలో 2004లో ‘వీర కన్నడిగ’ సినిమాకు దర్శకత్వం వహించాడు మెహర్ రమేశ్. ఇదే తెలుగులో ‘ఆంధ్రావాలా’. పూరి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ కాగా కన్నడంలో హిట్. ఆ తర్వాత 2006లో పునీత్ తోనే ‘అజయ్’ అనే సినిమా తీశాడు మెహర్. ఇది మహేశ్ బాబు ‘ఒక్కడు’కి రీమేక్. ఆ సినిమా కూడా అక్కడ బాగా ఆడింది. వరుసగా కన్నడంలో రెండు హిట్స్ తీయటంతో మన తెలుగు హీరోల దృష్టి మెహర్ పై పడింది. ఎన్టీఆర్ ‘కంత్రీ’, ప్రభాస్ ‘బిల్లా’ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం మెహర్ కి దక్కింది. అయితే స్టైలిష్ గా తీశాడు అనే పేరు వచ్చినా ఆ రెండు సినిమాలు పరాజయాలనే అందించాయి. ‘కంత్రీ’ ఫ్లాప్ అయినా మెహర్ టేకింగ్ నచ్చి ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాకు అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కూడా ఘోరపరాజయం పొందింది. ఆ తర్వాత వెంకటేశ్ ‘షాడో’ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ లభించింది మెహర్ కి. అయితే ‘షాడో’ దెబ్బకి మెహర్ రమేశ్ 8 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో ఉండి పోవలసి వచ్చింది. ఇప్పుడు ‘వేదాళం’ రీమేక్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ దొరికింది. నిజానికి ‘వేదాళం’ తెలుగులో డబ్ అయి విడుదల అయింది కూడా. అయినా ఆ సినిమాపై నమ్మకంతో స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు చిరంజీవి. మెహర్ తన ప్రతిభతో ‘భోళా శంకర్’ని మెప్పించాడు. అంతే మెగా డైరక్టరయ్యాడు. మరి మెగా టచ్ మెహర్ కి కలసి వస్తుందా!? 9 ఏళ్ళ అజ్ఞాతవాసం నుంచి విముక్తి లభిస్తుందా! ఇప్పటి వరకూ తెలుగులో హిట్ లేని మెహర్ కి ‘భోళా శంకర్’ తొలి సక్సెస్ ని అందిస్తుందా!? ఈ ప్రశ్నలన్నింటికీ 2022లో సమాధానం లభించనుంది. ఎందుకంటే ‘భోళా శంకర్’ రిలీజ్ అయ్యేది 2022లోనే. మరి మెహర్ కి బెస్టాఫ్ లక్ చెబుదామా!