యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రం శుక్రవారం జనం ముందుకు వచ్చింది. శతాధిక చిత్రాల దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కథ, కథనాలు ఏ మాత్రం కొత్తగా లేకపోవడంతో నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇది ఈ యేడాది కిరణ్ అబ్బవరం నటించగా విడుదలైన మూడో చిత్రం. ఇప్పటికే వచ్చిన ‘సెబాస్టియన్’, ‘సమ్మతమే’ చిత్రాలు సైతం పరాజయం పాలయ్యాయి. దాంతో కిరణ్ వరుసగా మూడో ఫ్లాప్ ను ఒకే యేడాది మూటకట్టుకున్నట్టు అయ్యింది. అదృష్టం బాగుండి కిరణ్ చేతిలో పెద్ద నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్ ‘మీటర్’, శ్రీ సాయి సూర్య మూవీస్ ‘రూల్స్ రంజన్’ సినిమాలలో కిరణ్ నటిస్తున్నాడు. అలానే మరో రెండు చిత్రాలు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్థంగా ఉన్నాయి. వాటిల్లో ఏది హిట్ అయినా అతను సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే! కిరణ్ నటించిన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ కు మంచి పేరొచ్చింది కానీ రెండో సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ కమర్షియల్ గానూ సక్సెస్ సాధించింది. ఆ ఒకే ఒక్క సక్సెస్ కారణంగా కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాడు.
చిత్రం ఏమంటే కొంతకాలం క్రితం సరిగ్గా ఇలాంటి పరిస్థితే యంగ్ హీరో కార్తికేయకూ ఎదురైంది. అతని మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తిక్’ నటుడిగా జస్ట్ గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతే! రెండో సినిమా ‘ఆర్.ఎక్స్. 100’ కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో అతనికి హీరోగా పలు ఆఫర్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత యేడాది వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90 ఎం.ఎల్.’ సినిమాలు విడుదలై పరాజయం పాలు కావడంతో కార్తికేయ ఫ్లాప్స్ లో హ్యాట్రిక్ సాధించినట్టు అయ్యింది. చివరకు అతను విలన్ గా నటించిన నాని ‘గ్యాంగ్ లీడర్’ సైతం ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు… గత యేడాది వచ్చిన గీతా ఆర్ట్స్ ‘చావు కబురు చల్లగా’, ‘రాజా విక్రమార్క’ సైతం ఫ్లాప్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కార్తికేయ విలన్ గా నటించిన మొదటి తమిళ సినిమా ‘వలిమై’ సైతం అతనికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం కార్తికేయ చాలా లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ చేతిలో ఒకటి, రెండు సినిమాలు ఉన్నాయి. మరి అవన్నా హిట్ అయ్యి అతను తిరిగి లైమ్ లైట్ లోకి వస్తాడేమో చూడాలి. ఏదేమైనా… కథల ఎంపికలో జాగ్రత్త తీసుకోకపోతే… కార్తికేయ మాదిరిగానే కిరణ్ అబ్బవరం సైతం సైడ్ అయిపోయే ప్రమాదం లేకపోలేదు!!