గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుందంటే పక్కాగా హిట్ అనే భావనలో ఉంటారు ఇటు బయ్యర్లు, అటు ప్రేక్షకులు. అయితే ఇటీవల కాలంలో ఆ సంస్థ చేసిన సినిమాలు చూస్తుంటే వారి జడ్జిమెంట్ తప్పుతుందేమో అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ‘పక్కా కమర్షియల్’ దానిని రుజువు చేస్తోంది. బన్నీవాసు సూత్రధారిగా జిఎ2 పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన సినిమాలు ‘భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే’ వరుసగా విజయాలు సాధించాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమా గీతా ఆర్ట్స్ సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బేసింది. ఆపై అఖిల్ తో తీసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ పర్వాలేదనిపించింది. అయితే గోపీచంద్ తో తీసిన ‘పక్కా కమర్షియల్’ ఫలితం మరోసారి డైలమాలో పడేసింది. దీనికి కారణం గీతా ఆర్ట్స్ తో పాటు దాని అనుబంధ సంస్థలతో పెరిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలేమో.
Jersey
అల్లు రామలింగయ్య వారసునిగా గీతా ఆర్ట్స్ సామ్రాజ్యాన్ని సింగిల్ హ్యాండ్ తో విస్తరించి పొట్టివాడైనా గట్టివాడు అనిపించుకున్న ఘనత అల్లు అరవింద్ ది. ‘చావు కబురు చల్లగా’నే కాదు ఆ తర్వాత అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన ‘ఘని’ కూడా చావుదెబ్బ తీసింది. ఇక తెలుగులో యావరేజ్ విజయం సాధించిన ‘జెర్సీ’ సినిమాను దిల్ రాజుతో కలసి హిందీలో పునర్మించారు అల్లు అరవింద్. ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక నిఖిల్ తో తీసిన ’18పేజెస్’ రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ సినిమాపై కూడా ఎలాంటి బజ్ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ స్టోరీ డిపార్ట్ మెంట్ ప్రక్షాళన చేయవలసిన అగత్యం ఎంతైనా ఉంది. ఆ దిశగా అల్లుఅరవింద్ ప్రయత్నాలు మొదలు పెట్టారో లేదో తెలియలేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’పై పూర్తి దృష్టి సారించిన అల్లు అరవింద్ తన ప్రొడక్షన్ కంపెనీపై కూడా ఓ లుక్కేయవలసిన సందర్భం వచ్చింది. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయేమో చూడాలి.