కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య రొమాన్స్ నడుస్తోందా? సోషల్ మీడియాలో ప్రజంట్ ఈ వార్త ఊపందుకుంది. ఇటీవల ఈ జంట తరచూ కలిసిన సందర్భాలు, సన్నిహితంగా మాట్లాడుకోవడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరు స్పందించకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మృణాల్ బర్త్‌డే వేడుకలో ధనుష్ హాజరవడం, ఇద్దరూ చాలా దగ్గరగా కనిపించడమే ఈ గాసిప్స్‌కు కారణమైంది. చేతులు పట్టుకున్న దృశ్యాలు, సెల్ఫీలు, వారిద్దరి మధ్య ఉన్న కంఫర్ట్ లెవెల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాక, మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్‌కు కూడా ధనుష్ హాజరైనట్లు తెలుస్తోంది.
Also Read : Mrunal Thakur: సినిమా ఫెయిల్యూర్‌కి రివ్యూలే కారణం..
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకుల తర్వాత ధనుష్ వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల సీనియర్ నటి మీనాను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించి, అవి పూర్తిగా తప్పుడు ప్రచారమని ఖండించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మృణాల్‌తో ఉన్న సన్నిహితత నేపథ్యంలో మరోసారి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
కానీ త్వరలో అనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తేరే ఇష్క్ మే’ అనే బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఇద్దరూ నటించనున్నారని సమాచారం. ఈ షూటింగ్ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్నేహమే ప్రేమలోకి మారిందా? అనే ప్రశ్నలు కూడా నెట్టింట వినిపిస్తున్నాయి. ఇంకా ఓ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మృణాల్ తన స్పాటిఫై ప్లేలిస్ట్‌లో “మామాస్ ఫేవ్స్” అనే సెక్షన్‌లో ధనుష్ రికమెండ్ చేసిన తమిళ పాటల జాబితాను పెట్టినట్టు నెటిజన్లు చెబుతున్నారు. ఈ అంశం కూడా ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చి నట్టైంది. మరి నిజంగా వీరి మధ్య ప్రేమ ఉందా లేక ఊహాగానమా అన్నది తేలాలంటే వారి స్పందనకే వేచి చూడాల్సిందే!