Naga Sourya: యువ కథానాయకుడు నాగశౌర్యకు చెందిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పటి వరకూ నాలుగు సినిమాలు వచ్చాయి. ‘ఛలో’తో మొదలైన ఈ సంస్థ ప్రస్తానం ‘నర్తనశాల, అశ్వద్థామ, కృష్ణ వ్రింద విహారి’ చిత్రాల మీదుగా సాగింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి వైవిద్యమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంస్థ తన ఐదో చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ‘ధమాకా’ ఫేమ్ త్రినాథ రావు నక్కినతో తీయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మంగళవారం విడుదల చేశారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేస్తూ, ‘తమ సంస్థ ఇంతవరకూ నిర్మించిన చిత్రాల్లోనే కాకుండా త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన సినిమాల్లోనూ ఇది భారీ బడ్జెట్ చిత్రం కాబోతోంద’ని తెలిపారు. హీరో పేరు ఇంకా ప్రకటించకపోయినా… ఈ ప్రతిష్ఠాత్మక భారీ చిత్రాన్ని నాగశౌర్యతోనే తీస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియచేస్తామని ఉషా, శంకర్ ప్రసాద్ ముల్పూరి చెప్పారు. నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ ప్రస్తుతం ధియేటర్లలో ఉంది.