మన దేశంలో తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధి పాత్ర పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాయోజిత కార్యక్రమాల్లో దర్శన మిచ్చారు. అలాగే ఆమె పాత్ర సైతం అనేక పీరియాడిక్ మూవీస్ లో కనువిందు చేసింది. తాజాగా ఇందిరాగాంధి పాలన తీరు తెన్నులపై రూపొందుతోన్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధిగా నటించబోతోంది. ఇందిర పాత్రలో కంగన తన గెటప్ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా తెరపై ఇందిరాగాంధి పాత్రలో వెలిగిన నటీమణులెవరో ఓ సారి గుర్తు చేసుకుందాం.

ప్రముఖ కవి, దర్శకుడు గుల్జార్ 1975లో తాను రూపొందించిన పొలిటికల్ డ్రామా ‘ఆంధి’లో ఇందిరాగాంధీని పోలిన పాత్రలో ప్రముఖ నటి సుచిత్రా సేన్ ను నటింప చేశారు. అచ్చు ఇందిర లాగే సుచిత్ర ధరించిన ఆర్తి దేవి పాత్రను చిత్రీకరించారు. సుచిత్ర నటనను అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సైతం అభినందించారని అంటారు.

తరువాత సల్మాన్ రష్దీ నవల ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ ఆధారంగా దీపా మెహతా తెరకెక్కించిన చిత్రంలోనూ ఇందిరాగాంధీ పాత్ర ఉంది. అందులో ఆ పాత్రను సరితాచౌదరి ధరించారు.

మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ‘ఇందు సర్కార్’లో ఇందిరాగాంధి పాత్రలో సుప్రియ వినోద్ నటించారు. యన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లోనూ ఇందిరాగాంధీ పాత్రలోనే సుప్రియ వినోద్ కనిపించడం విశేషం! అలా రెండు సార్లు ఇందిర పాత్రలో సుప్రియ నటించి ప్రత్యేకంగా నిలిచారు.

సుప్రియ వినోద్ లాగే రెండు చిత్రాలలో ఇందిరాగాంధీ పాత్రను పోషించిన ఘనతను అవంతికా అవేర్కర్ దక్కించుకున్నారు. శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే జీవితం ఆధారంగా రూపొందిన ‘థాకరే’లోనూ, తరువాత తొలిసారి భారత్ వరల్డ్ కప్ గెలుపొందిన నేపథ్యంలో తెరకెక్కిన ’83’ లోనూ అవంతిక ఇందిరాలా అలరించారు.

సుప్రియ, అవంతిక సరసన ఫ్లోరా జాకబ్ కూడా చేరతారు. ఆమె కూడా అజయ్ దేవగణ్ ‘రెయిడ్’లోనూ, కంగనా రనౌత్ ‘తలైవి’లోనూ ఇందిరగా కనిపించారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ గా ఒమంగ్ కుమార్ రూపొందించిన ‘పి.యమ్.నరేంద్ర మోడీ’లో ఇందిరాగాంధీగా కిశోరీ షహానే తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.

అక్షయ్ కుమార్ థ్రిల్లర్ ‘బెల్ బాటమ్’లో ఇందిరాగాంధీలా లారా దత్త మెప్పించారు.

అజయ్ దేవగణ్ నటించిన ‘భుజ్:ద ప్రైడ్ ఆఫ్ ఏ నేషన్’లో ఇందిరాగాంధీగా నవ్నీ పరిహార్ కాసేపే తెరపై కనిపించారు. ఇలా ఇప్పటిదాకా ఎనిమిది మంది తారలు ఇందిరాగాంధీలా వెండితెరపై వెలుగులు విరజిమ్మారు.

ఇందిర పాత్రను ధరిస్తున్న తొమ్మిదవ నటిగా కంగనా రనౌత్ నిలిచారు. ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ ఎప్పుడు జనం ముందు నిలుస్తుందో కానీ, ఇందిరగా మాత్రం కంగన జనం మదిని గెలుస్తుందని గెటప్ చూస్తే అనిపిస్తోంది.