బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది.
దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ దర్శకుడు ఈ ట్రయాలజీకి దర్శకత్వం వహిస్తారని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ విశేషాలను తెలియచేస్తూ, అధికారికంగా ఓ చిన్న వీడియోను సోనీ పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. మాజీ ఫిల్మ్ జర్నలిస్టులు ప్రశాంత్ సింగ్, మాధుర్య వినయ్ తో పాటు ‘శక్తిమాన్’ ఫేమ్ ముఖేష్ ఖన్నా సైతం ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.