ఒకప్పుడు అమెరికాలో షూటింగ్ నిర్వహించడం చాలా సులువుగా ఉండేది. వీసా కూడా ఈజీగా దొరికేది. కానీ, కరోనా వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీసా కోసం నెల రోజుల వరకూ వేచి ఉండాల్సి వస్తోంది. దీనికితోడు నియమ, నిబంధనలు మరింత కఠినంగా మారాయి. దీంతో.. అమెరికాలో షూటింగ్ నిర్వహించాలంటే, పెద్ద తలనొప్పిగా మారింది. ‘సర్కారు వారి పాట’ చిత్రబృందాన్ని వీసా సమస్యలు ఎలా వెంటాడాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. వీసా సమస్యల వల్లే షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ప్రతీ సినిమాకి ఇలాగే వీసా సమస్యలు వస్తున్న తరుణంలో.. చాలామంది అమెరికాలో తమ సినిమా చిత్రీకరణల్ని రద్దు చేసుకుంటున్నారు. ఆల్రెడీ NBK107 మేకర్స్ అక్కడ ప్లాన్ చేసిన షెడ్యూల్‌ని రద్దు చేసేసింది. దర్శకుడు గోపీచంద్ మలినేని గ్రాండ్‌గా ఒక షెడ్యూల్‌ని అక్కడ ప్లాన్ చేస్తే.. వీసాతో పాటు ఇతర సమస్యల కారణంగా అక్కడి నుంచి టర్కీకి షెడ్యూల్‌ని షిఫ్ట్ చేశాడు. ఇతర చిత్రబృందాలు అదే బాట పట్టడాయి. అమెరికాను పక్కన పెట్టేసి.. టర్కీ లేదా యూరప్ దేశాల్లో షూటింగ్ నిర్వహించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లేకపోతే భారత్‌లోనే మ్యానేజ్ చేస్తున్నారు
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోనే అమెరికా ఇలా కఠిన ఆంక్షలు పెడుతోందని సమాచారం. మరి, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా? లేక మున్ముందు మార్పులేమైనా వస్తాయా? భవిష్యత్తు సంగతి దేవుడెరుగు.. ఇప్పటికైతే చాలా సినిమాలు యూఎస్‌లో షూటింగ్‌కి క్యాన్సిల్ చేసుకుంటున్నాయి.