పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ లో అత్యద్భుతమైన చిత్రాలను నిర్మించారు స్వర్గీయ ఏడిద నాగేశ్వరరావు. ఆయన కుమారుడు, నటుడు ఏడిద శ్రీరామ్ కుమార్తె శ్రీజ నిర్మాతగా మారి తొలియత్నంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీని నిర్మించింది. ఈ సినిమా ఇదే నెల 2వ తేదీ జనం ముందుకు వచ్చింది. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కెవి అనుదీప్ శిష్యులు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దీన్ని డైరెక్ట్ చేశారు.
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ మూవీ విడుదల నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. చిత్ర బృందానికి తీవ్ర నిరాశనూ కలిగించింది. అయితే ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ మూవీని ఆహా ఓటీటీ సంస్థ ఈ నెల 23న అంటే విడుదలైన మూడు వారాలకు స్ట్రీమింగ్ చేయబోతోంది. మరి థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ మూవీని కనీసం ఓటీటీలో అయినా జనం వీక్షిస్తారేమో చూడాలి.