Ponniyin Selvan: బాహుబలి.. ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. చారిత్రక సినిమాలు ఇలా ఉంటాయి అని రుజువు చేసింది. రాజులు, రాజుల పగలు, రాజుల వ్యూహాలు , రాజుల ఆహార్యం ఇలా ఉంటుందని చూపించింది. అందులో పాత్రలు, ప్రదేశాలు నిజం కాకపోవచ్చు. కానీ ఆ సినిమా చూశాకా మరో చారిత్రాత్మక సినిమా చూడాలంటే దానితో పోల్చకుండా అయితే ఉండలేనంతగా మారిపోయింది. ఇలాంటి సినిమా తీయాలని అన్ని భాషల ఇండస్ట్రీలు తపన పడి బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ వంతు వచ్చింది. ఇది కూడా అన్ని సినిమాల్లానే తేలిపోయింది. బాహుబలిని మించిన సినిమా మరొకటి రాదు.. రాబోదు అని తెలుగువాడు గర్వంగా చెప్పుకొనేలా చేసింది.
కోలీవుడ్ బాహుబలి అని చెప్పుకుంటున్న పొన్నియిన్ సెల్వన్ నేడు రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకొంటుంది. అయితే బాహుబలి చూసిన కళ్ళతో సినిమా చూస్తే మాత్రం ఈ సినిమాకు నిరాశ తప్పదు అంటున్నారు అభిమానులు. మణిరత్నం ఏమి మామూలు దర్శకుడు కాదు, నటించినవారేమో కొత్త నటులు కాదు. అయితే సినిమాను రాజమౌళి చూపించినట్లు చూపించలేకపోయారని అంటున్నారు అభిమానులు. అసలు అన్ని పాత్రలు, వాటి వివరణ ఇవ్వడంలో మణిరత్నం విఫలమయ్యాడని చెప్పుకొస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ తమిళంలో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఒకటి. ఆ నవల పేరు ఎత్తితే గూస్ బంప్స్ వస్తాయి.. కానీ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ రావడం అటు ఉంచితే నీరసం వచ్చిందని చెప్తున్నారు. పాత్రలు ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలియడంలేదని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం బాహుబలి ని దృష్టిలో నుంచి తీసేసి సినిమా చూస్తే ఒక్కసారి చూడొచ్చు అని చెప్తున్నారు. ఏదిఏమైనా ఈ సినిమా విషయంలో మణిరత్నం ఒకసారి ఆలోచించాల్సి ఉందని మాత్రం చెప్పుకొస్తున్నారు.