మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వం’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. భారీ తారాగణం, విజువల్ గ్రాండియర్, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద అసెట్స్. నిజానికి ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే తమిళనాట కనిపించినంత హడావుడి తెలుగులో మాత్రం కనపడటం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఇటీవల విక్రమ్, కార్తీ సినిమాలేవీ ఆడక పోవడం, మణిరత్నం తెలుగునాట ఫేడవుట్ కావటం, జయం రవికి తెలుగులో మార్కెట్ లేకపోవడం, రెహమాన్ సినిమాలకు కూడా క్రేజ్ లేకపోవడం వంటివి అందుకు ఉదాహరణలు. దీనిని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం ఒక్కటే కలసి వచ్చే అంశం. ఈ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఆ రోజే మణిరత్నం సినిమాపై మరో రెండు సినిమాలు దండయాత్రకు రెడీ అవుతుండటమే తలనొప్పిని కలిగించే అంశం..
హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ‘విక్రమ్ వేద’ కూడా సెప్టెంబర్ 30నే విడుదల కానుంది. తమిళ సినిమా రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. హృతిక్ రోషన్ మూడేళ్ల తర్వాత చేసిన సినిమా కావటంతో నార్త్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మల్టీప్లెక్స్‌లో భారీ స్థాయిలో కాబోతుండటం గమనార్హం. ఇది మణిరత్నం ప్యాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్’కు పెద్ద డ్రా బ్యాక్. ఐశ్వర్యారాయ్ వంటి తార ఉన్నప్పటికీ తమిళ నేటివిటీకి చెందిన కథ కావటంతో గ్యాంగ్ స్టర్ సినిమా ‘విక్రమ్ వేద’నే పై చేయి కావటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన ‘నానే వరువేన్’ కూడా సెప్టెంబర్ 30న రానుండటం మణితర్నం సినిమాపై పెద్ద ఎఫెక్ట్ పడనుంది. ఎందుకంటే ఇటీవల విడుదలైన ధనుష్ సినిమా ‘తిరు’ బాగా లేదంటూనే తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ధనుష్ సినిమాలు వరుసగా సక్సెస్ కావటం కూడా బాగా కలసి వచ్చే అంశం. ఇక ‘నానే వరువేన్’ దర్శకుడు సెల్వ రాఘవన్‌కి కూడా అభిమాన గణం బాగానే ఉంది. ఇదలా ఉంచితే ఆక్టోబర్ ఫస్ట్ వీక్ లో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’, నాగ్ నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా విడుదల కానున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ‘పొన్నియన్ సెల్వన్’ కి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప బయటపడే ఛాన్స్ లేదు. మరి హృతిక్, ధనుష్ దాడి నుంచి మణిరత్నం తప్పించుకుని బయటపడతాడా? చిరు, నాగ్ ని దాటుకుని హిట్ బాట పడతాడా అన్నది తేలాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.