Foot Ball: ప్రపంచంలో అత్యధికులను ఆకర్షించే ఆట ఏది అంటే ‘ఫుట్ బాల్’ అనే సమాధానమే వినిపిస్తుంది. మనదేశంలో ‘ఫుట్ బాల్’ క్రేజ్ అంతగా లేదు. కానీ, అగ్ర రాజ్యాలు మొదలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ‘సాకర్’ ఆటపైనే గురి పెడుతున్నాయి. ‘ఫిఫా వరల్డ్ కప్ -2022’ ఆదివారం (నవంబర్ 20న) ఖతార్ లో మొదలయింది. అప్పటి నుంచీ ఆ ఆటపై దేశంలోని సాకర్ ఫ్యాన్స్ దృష్టి కూడా సాగుతోంది. డిసెంబర్ 18న సాకర్ ఫైనల్స్ సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఫుట్ బాల్’ను ఆధారం చేసుకొని రూపొందిన హాలీవుడ్ చిత్రాలలో టాప్ టెన్ ఏవో గుర్తు చేసుకుందాం.
ఐఎమ్.డీబీ రేటింగ్స్ లో ‘గోల్ 2: లివింగ్ ద డ్రీమ్’ (2007) పదో స్థానంలో నిలచింది. దానికి పై స్థానంలో ‘యునైటెడ్ 1’ (2011) చోటు సంపాదించింది. ఇక ఎనిమిదో స్థానంలో ‘ఫీవర్ పిచ్’ (2005) ఉంది. ఏడో స్థానంలో 2005 నాటి ‘కికింగ్ అండ్ స్క్రీమింగ్’ నిలచింది. మన దేశం మూలాలు ఉన్న గురిందర్ ఛద్దా తెరకెక్కించిన ‘బెండ్ ఇట్ లైక్ బెక్హామ్’ (2002) ఆరో స్థానం ఆక్రమించింది. దానికి పై స్థానంలో ‘షావోలిన్ సాకర్’ (2001) నిలవగా, నాలుగో స్థానంలో ‘గ్రీన్ స్ట్రీట్ హూలిగాన్స్’ (2005) స్థానం దక్కించుకుంది. 1981 నాటి ‘విక్టరీ’ మూడో స్థానంలోనూ, ‘గోల్ ద డ్రీమ్ బిగిన్స్’ (2005) రెండో స్థానంలోనూ నిలిచాయి. వివాదస్పదమైన ఇంగ్లిష్ కోచ్ బ్రియాన్ క్లౌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ద డ్యామ్డ్ యునైటెడ్’ (2009) ప్రథమస్థానంలో వెలుగుతోంది.
మన దేశం విషయానికి వస్తే ఈ యేడాది మార్చిలో జనం ముందు నిలచిన ‘ఝుండ్’ పదో స్థానంలో నిలచింది. 2021లోనే పూర్తయి పలు వాయిదాలు చూసిన అజయ్ దేవగన్ ‘మైదాన్’ తొమ్మిదో స్థానం చేజిక్కించుకుంది. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనుంది. 2019లో వచ్చిన న’పెనాల్టీ’ ఎనిమిదో స్థానంలోనూ, 2017 నాటి ‘తూ హై మేరా సండే’ ఏడో స్థానంలోనూ ఉన్నాయి. 2015లో రూపొందిన లో బడ్జెట్ మూవీ ’27 డిసెంబర్ 1987 ఫైనల్ మ్యాచ్’ ఆరో స్థానంలోనూ, 2011 నాటి ‘స్టాండ్ బై’ ఐదో స్థానంలోనూ, ‘సికందర్’ (2009) నాలుగో స్థానంలోనూ నిలిచాయి. ‘ధన్ ధనా ధన్ గోల్’ (2007) మూడో స్థానం చేజిక్కించుకోగా, 1999లో రూపొందిన ‘ద గోల్’ రెండో స్థానం దక్కించుకుంది. 1984లో తెరకెక్కిన ‘హిప్ హిప్ హుర్రే’ మొదటి స్థానం ఆక్రమించింది.
మన తెలుగు సినిమాల విషయానికి వస్తే – ఎక్కువగా క్రికెట్ నేపథ్యమున్న చిత్రాలే రూపొందాయి. పాత రోజుల్లో కబడ్డీ, ఆ తరువాత కూడా కొన్ని చిత్రాలలో కబడ్డీ చోటుచేసుకున్నాయి. కాగా, తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందిన ‘ విజేత’లో ఆయన ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తారు. ఇక వంశీ తెరకెక్కించిన ‘ఏప్రిల్ 1 విడుదల’లోనూ ఫుట్ బాల్ ఆట నేపథ్యంలోనే కథ మలుపు తిరుగుతుంది. కొన్ని చిత్రాలలో కాలేజ్ లో ఫుట్ బాల్ ఆడే సీన్స్ కనిపిస్తాయే తప్ప వాటి చుట్టూ కథ తిరిగిన దాఖలాలు లేవు.