షకీరా పాట ఉరకలు వేసే ఉత్సాహం నింపుతుందని అమెరిన్ల అభిప్రాయం! తన పాటతోనే కాదు, నాజూకు షోకులతోనూ కుర్రాళ్ళను కిర్రెక్కించిన గాయని షకీరా. ఇంతకూ షకీరాను గురించి ఇప్పుడు అదే పనిగా ముచ్చటించుకోవడానికి కారణమేంటి? 46 ఏళ్ళ షకీరా ఇప్పటికి ఇద్దరితో సహజీవనం సాగించింది. 2000-2010 మధ్యకాలంలో అర్జెంటీనా లాయర్ ఆంటోనియో డి లా రుయాతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది అమ్మడు. ఇక 2011 నుండి గత సంవత్సరం దాకా స్పానిష్ ఫుట్ బాలర్ గెరార్డ్ పిక్ తో కలసి సాగింది. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం, హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్ ఈ అమ్మడితో ప్రేమాయణం సాగిస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది.
అరవై ఏళ్ళు నిండినా ఇప్పటికీ కుర్రాడిలా కనిపించే టామ్ క్రూయిజ్ ముగ్గురు పెళ్ళాలను వదిలేశారు. 2012 నుండి సింగిల్ గానే ఉంటున్నారు టామ్. ఈ నేపథ్యంలో టామ్ మనసు దోచిన అమ్మాయిలు పలువురి పేర్లు వినిపించినా, అతను ఎవరితోనూ ముందుకు సాగినట్టు కనిపించదు. అయితే షకీరా విషయంలో మాత్రం టామ్ సీరియస్ గానే ఉన్నారని తెలుస్తోంది. షకీరా మాత్రం తామిద్దరమూ మంచి ఫ్రెండ్స్ మని, ఆయనకు తన పాటలంటే ఇష్టమని, అలాగే టామ్ సినిమాలంటే తనకూ ఇష్టమని చెబుతోంది. అంతేకాదు, తన ఇద్దరు పిల్లలపైనే ఫోకస్ పెట్టానని, ఇప్పట్లో ప్రేమాయణాలకు వీలు లేదనీ అంటోంది. అయితే హాలీవుడ్ మీడియా మాత్రం టామ్, షకీరా డేటింగ్ చేస్తున్నట్టు ఆధారాలు చూపుతూ పలు పిక్స్ వైరల్ చేస్తోంది. మియామీలోని ఓ రెస్టారెంట్ లో టామ్, షకీరా అన్యోన్యంగా ఉన్న చిత్రాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో టామ్ పెదవి విప్పడం లేదు. ఎందుకనో!?