కళాకారులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని కాపాడేవీ కళలే! ఈ కొటేషన్ ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందటే – ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్ పై కోర్టులో న్యాయ పోరాటం చేసే సమయంలో ఆందోళన నుండి దూరం కావడానికి సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఆశ్రయించాడట. సంగీతం వింటూ ఆత్మస్థైర్యం పెంచుకున్న జానీ డెప్, తీరిక దొరికింది కదా అని తనలోని చిత్రలేఖనానికీ పని పెట్టాడట. అలా ప్రఖ్యాత నటీనటులు ఎలిజబెత్ టేలర్, అల్ పికనో, బాబ్ డిలాన్, కెయిత్ రిచర్డ్స్ పొర్ట్రెయిట్స్ గీశాడట. ఆ బొమ్మలకు సంబంధించిన ప్రింట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాడట. ఎంచక్కా కోర్టులో మాజీ భార్యపై జానీ డెప్ గెలుపు సాధించగానే, తనలోని ఇతర కళలనూ లోకానికి పరిచయం చేయాలని తాను గీసిన బొమ్మలను ఆర్ట్ గేలరీలో పెట్టాడట. లిజ్, బాబ్, అల్, కెయిత్ – ఈ నాలుగు చిత్రపటాలకే దాదాపు 3.6 మిలియన్ అమెరికన్ డాలర్ల రేటు పలికిందట. అలాగే ఈ నలుగురి ప్రింట్స్ దాదాపు 800 అమ్ముడయ్యాయట. ఇప్పటి దాకా నటనతో కోట్ల రూపాయలు పోగేసిన జానీ డెప్ తొలిసారి చిత్రకారునిగా అందుకున్న మొత్తం రూ.29 కోట్ల 56 లక్షలకు పై చిలుకన్నమాట! అది తనకెంతో ఆనందం కలిగిస్తోందని అంటున్నాడు జానీ డెప్.
ఎవరికైనా విజయం ఇచ్చే సంతోషమే వేరు! అంబర్ పై కోర్టులో సాధించిన విజయంతో మరింత ఉత్సాహంగా కుంచెను పరుగులు తీయించి, బాబ్ మర్లే, హీత్ లెడ్జర్, రివర్ ఫీనిక్స్ వంటి నటుల పొట్రెయిట్స్, రచయిత హంటర్ ఎస్. థాంప్సన్ బొమ్మ వేశాడు జానీ. వీటిని గత మాసం కేజిల్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి పెట్టగా హాట్ కేక్స్ లాగా అమ్ముడయ్యాయట. ఈ నాలుగు ప్రింట్స్ లో ఒక్కోదాని విలువ 4,500 డాలర్లట. అదే నాలుగు ప్రింట్స్ సెట్ కొంటే 17,000 డాలర్లకే వస్తాయట. పైన పేర్కొన్న వారి బొమ్మలనే జానీ డెప్ ఎందుకు చిత్రీకరించాడు అన్న ఆలోచన కలుగవచ్చు. వీరందరూ జానీ డెప్ జీవితాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసినవారేనట! అలాగే వీరిలో కొందరు జానీ నటునిగా మారడానికి కారకులు కూడా అయ్యారట. అందుకే వారిపై గౌరవంతో కుంచె పట్టి వారి బొమ్మలను చిత్రీకరించాడు. మరి ఈ బొమ్మల ద్వారా వచ్చే మొత్తాన్ని జానీ డెప్ ఏం చేయనున్నాడో ఇంకా వివరించలేదు. కానీ, జానీ డెప్ మంచి నటుడే కాదు, ప్రతిభగల చిత్రకారుడూ అనిపించుకున్నాడు. బహుశా, భవిష్యత్ లో తనలోని సంగీత కళాకారుణ్ణి సైతం జానీ జనం ముందు నిలుపుతాడేమో చూడాలి.