Gargeyi Yellapragada: ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’ చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు శిష్యులు కాకర్ల శ్రీనివాసు. ‘తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఊహించని అవాంతరం. దాంతో విజయవాడ నుంచి హైద్రాబాద్ కు హుటాహుటిన కారులో ప్రయాణం, ఆ నాలుగు గంటలలో ఉత్కంఠ రేపే పరిణామాలు… ఈ నేపథ్యంలో ‘హలో మీరా’ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాన’ని దర్శకులు కాకర్ల శ్రీనివాసు చెబుతున్నారు.
Read Also: Kida: తొలి తమిళ చిత్రంతోనే ‘స్రవంతి’ రవికిషోర్‌కు గౌరవం
ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ..‘సింగిల్ క్యారెక్టర్ తో డిఫరెంట్ ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయడం అనేది ఓ ఛాలెంజ్. తొలి సినిమాతోనే ఆ సవాలు నేను స్వీకరించాను. రొటీన్ కు భిన్నంగా ఉండే చిత్రాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోయింది. అందువల్ల సింగిల్ క్యారెక్టర్‌తో ఈ మూవీ చేయడం రిస్క్ అని అనిపించలేదు. ఎందుకంటే.. తెర మీద ప్రేక్షకులకు కనిపించేది ఒకే పాత్రే అయినా.. ఆ యువతి తన కుటుంబ సభ్యులతో, తన సమస్యకు కారకులైన వ్యక్తులతో, ఇతరులతో సంభాషిస్తూనే ఉంటుంది. దాంతో ఆయా పాత్రల వాయిస్ బట్టి.. వారి హావభావాలను ప్రేక్షకులు ఊహించుకుంటారు. వాళ్ళకు ఈ సినిమా ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చక్కని స్పందన లభించిందని, ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామ’ని నిర్మాతలు డాక్టర్ లక్ష్మణరావు దిక్కల, వర ప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల తెలిపారు. ‘ఇందులోని సింగిల్ క్యారెక్టర్ ను గార్గేయి యల్లాప్రగడ అద్భుతంగా పోషించిందని, ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇవ్వడం పక్కా’ అని చిత్ర సమర్పకులు జీవన్ కాకర్ల చెప్పారు. ‘హలో మీరా’ చిత్రానికి ఎస్. చిన్న సంగీతం అందించగా, ప్రశాంత్ కొప్పినీడు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.