గత కొంతకాలంగా లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేసిన హెబా పలేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆమె నటించిన సినిమాలు వరుస పెట్టి జనం ముందుకు వస్తున్నాయి. హెబా కీలక పాత్ర పోషించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆమె టైటిల్ రోల్ ప్లే చేసిన మరో సినిమా ‘గీత’ సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది. ‘తెలిసినవాళ్ళు’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలోనూ రెండు సినిమాలలో హెబా నటిస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ అనే సినిమా షూటింగ్ గురువారం మొదలైంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
‘హుషారు’ సినిమాతో చక్కని విజయాన్ని అందుకుని, నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘అలా నిన్ను చేరి’ చిత్ర ప్రారంభోత్సవం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగింది . హీరో హీరోయిన్లు దినేశ్ తేజ్, హెబా పటేల్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాజీ ఎమ్మెల్యే జి. వి. ఆంజనేయులు క్లాప్ నివ్వగా, మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ మూర్తి, హనుమంతరావు, కృష్ణారావు, ‘గరుడవేగ’ అంజి, ‘హుషారు’ ఫేమ్ తేజస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలను, సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించబోతున్నారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీకి పి.జి. వింద సినిమాటోగ్రాఫర్. ఇందులో పాయల్ రాధాకృష్ణ, శివ రామచంద్రవరపు, ‘రంగస్థలం’ నాగ మహేష్ తదితరులు కీలకపాత్రలు పోషించబోతున్నారు.