Samuthirakani: తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది ‘విమానం’ చిత్రం. శివప్రసాద్ యానాల రచించి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టేకాఫ్ ప్రోమో శుక్రవారం విడుదలైంది. విమానంలో ప్రయాణించాలని కలలు కనే ఏడేళ్ళ రాజు అనే కుర్రాడు ఆ కోరికను దివ్యాంగుడైన తన తండ్రి వీరయ్యతో చెప్పడం ప్రోమోలో ఉంది. దిగువ మధ్య తరగతికి చెందిన ఆ తండ్రి కుర్రాడి విమాన ప్రయాణం తన స్థాయికి మించిది కావడంతో నిరుత్సాహ పరుస్తాడు. పెద్దయ్యాక విమానంలో ప్రయాణం చేయొచ్చునంటూ సముదాయిస్తాడు. తండ్రీ కొడుకుల అనుబంధం ప్రధానంగా ‘విమానం’ చిత్రం ఉంటుందని ఈ ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఇందులో సింగిల్ పేరెంట్ రాజయ్యగా సముతిరకని, ఆయన కొడుకుగా మాస్టర్ ధృవన్ నటించారు. ‘గుడుంబా శంకర్’ ఫేమ్ మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రను పోషించింది. అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, ‘నాన్ కడవుల్’ రాజేంద్రన్ సైతం ప్రాధాన్యమున్న పాత్రలు చేశారు. చరణ్ అర్జున్ స్వరాలు సమకూర్చారు.
ఈ సినిమా గురించి జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ”గొప్ప నటులు, సాంకేతిక నిపుణులతో రూపుదిద్దుకున్న ‘విమానం’కు భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. కె.కె క్రియేటివ్ వర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించడం గర్వంగా అనిపిస్తోంది. అద్భుతమైన కథతో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఈ సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా ప్రేక్షకులలో ఓ స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. దీనిని జూన్ 9వ తేదీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నాం” అని అన్నారు.