పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ సందడి మెల్లగా మొదలయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఎ.ఎమ్.రత్నం సమర్పణలో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’కు సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇటీవల హల్ చల్ చేశాయి. తాజాగా సదరు పిక్స్ లోని యాక్షన్ మూవ్ మెంట్స్ తో ఓ వీడియో ఇప్పుడు అభిమానులకు ఆనందం పంచుతోంది.
ఇంతకు ముందు నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి హిస్టారికల్ మూవీ రూపొందించి విజయం సాధించారు క్రిష్. ఆ అనుభవంతోనే ఈ సారి కూడా ‘హరి హర వీరమల్లు’లో 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో మొఘల్ పాలకులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు ‘హరి హర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అందుకోసం ఆయన పోరాట సన్నివేశాల సాధన చేశారు. అప్పుడు తీసిన వీడియోనే ఇప్పుడు ఇలా సందడి చేస్తోందన్న మాట. చివరలో పవన్ కళ్యాణ్ గాల్లోకి ఎగిరి ప్రత్యర్థిని కొట్టేలా చేసిన ఫీట్ ఆకట్టుకుంటోంది. ఒక్క బిట్ లోనే ఇంతలా ఆకట్టుకుంటున్న ‘హరి హరి వీరమల్లు’ సినిమాగా ఏ తీరున అలరిస్తుందో అన్న ఆసక్తిని ఈ వీడియో కలిగిస్తోంది.