Panja Vaisshnav Tej : తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఓ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్రను అపర్ణాదాస్ పోషించబోతోందనే విషయాన్ని బుధవారం మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు, తమిళ హీరో జీవీ ప్రకాశ్ ను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. విశేషం ఏమంటే… ఇదే సంస్థ జనవరిలో విడుదల చేసిన ‘సార్’ మూవీకి కూడా జీవీ ప్రకాశే సంగీతాన్ని అందించాడు. అప్పుడు ఏర్పడిన అనుబంధం ఈ సినిమాకూ కొనసాగుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంట్ శ్రీలీలతో పాటు.. ప్రతిభగల నటీనటులు అపర్ణా దాస్, జోజు జార్జ్ చేరడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ కు ఆ తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. అయితే ఇప్పుడీ సినిమాతో ఆ లోటు తీరుతుందనే భావనతో అతనున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మునుపెన్నడూ చూడని వైష్ణవ్ ను చూస్తారని మూవీ అనౌన్స్ మెంట్ వీడియోతో తెలిసింది. ఇటీవల వైష్ణవ్ తేజ్ అన్న సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో తమ్ముడు సైతం ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. పీవీటీ04 మూవీ ఆల్బమ్ ఖచ్చితంగా మరో పెద్ద చార్ట్‌బస్టర్ కానుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. త్వరలో గ్లింప్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.