Ori Devuda: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా.. తమిళ్ సూపర్ హిట్ సినిమా ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. మాతృకకు దర్శకత్వం వహించిన అశ్వత్.ఎం తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు హైలైట్ అంటే వెంకటేష్ దేవుడిగా నటించడమే. మోడ్రన్ దేవుడిగా, జడ్జిగా వెంకీ మామ ట్రైలర్ లో కనిపించాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
గుండెల్లోనా అంటూ సాగే ఈ సాంగ్ ను తమిళ్ రాక్ స్టార్ అనిరుధ్ ఆలపించారు. ఈ చిత్రంలో మిథిలా తో పాటు ఆశ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ లో విశ్వక్ ఆమెను మీరా అక్క.. నా చిన్నప్పటి క్రష్ అని హీరోయిన్ కు పరిచయం చేయడం, ఆమె వలన వీరిద్దరి మధ్యలో గొడవలు రావడం చూపించారు. ఇక తాజా సాంగ్ లో క్రష్ మీరా అక్కతో విశ్వక్ రొమాంటిక్ సాంగ్ లో ఆడిపాడాడు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. తన క్రష్ ను తలుచుకొని ఒక యువకుడు ప్రేమ భావాలను పంచుతున్నట్లు లిరిక్స్ ను బట్టి తెలుస్తోంది. ఇక విశ్వక్ సిగ్నేచర్ స్టెప్ అదిరిపోయింది. ఇక నుంచి ప్రతి యువకుడు ఈ సిగ్నేచర్ స్టెప్ తో రీల్స్ చేయడం ఖాయమనిపిస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ ఫ్రెష్ లవ్ ఫీల్ ను తీసుకొస్తుంది. పీవీపీ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా విశ్వక్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.