కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నిభాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక యష్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మాములుగా లేదు. యష్ నటనకు, అతడు చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఈలలు, గోలలు చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి థియేటర్లో తుపాకీతో హల్చల్ చేశాడు. యష్ డైలాగ్స్ ని అనుకరిస్తూ తుపాకీని గాల్లోకి లేపి ఫైర్ చేశాడు. ఈ అనుకోని సంఘటనకు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ ఘటన కర్ణాటక, శిగ్గావిలోని రాజశ్రీ థియేటర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గత రాత్రి కెజిఎఫ్ 2 చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు.. థియేటర్ లో హల్చల్ చేశాడు. యష్ పవర్ ఫుల్ డైలాగ్ ని అనుకరిస్తూ గాల్లో తుపాకిని లేపి మూడు రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల్లో వసంత్ కుమార్ అనే వ్యక్తికి కాలిలో బుల్లెట్ దిగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆగంతకుడు ఎవరు అనేది చీకట్లో కనిపించలేదని, కాల్పులు జరిపిన అనంతరం అతడు పరారయ్యాడని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.