విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా పేరు ప్రకటించుకోకపోవడం గమనార్హం! ఈ రెండు చిత్రాలకు దర్శకునిగా ఎవరి పేరూ కనిపించక పోవడంతో జనం ఒక్కొక్కరు ఒక్కోలా భావించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ దర్శకుడు పి.పుల్లయ్య “చూశావా…జనం ఏమనుకుంటున్నారో… పైగా దర్శకుడు కెప్టెన్ లాంటివాడు. అతని పేరే ప్రకటించక పోవడం, ఆ సీటును అవమానించడమే” అని యన్టీఆర్ ను మందలించారు. దాంతో రామారావు, ఆయనను క్షమించమని కోరారు. తనకు దర్శకులను చిన్నచూపు చూసే ఉద్దేశం లేదని చెప్పారు. దర్శకునిగా తనకు పెద్దగా అనుభవం లేనందున పేరు ప్రకటించుకోలేదని చెప్పారు. ఈ రెండు చిత్రాల తరువాత స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’కు దర్శకునిగా సినిమా టైటిల్ తరువాతనే, పేరు ప్రకటించుకున్నారు యన్టీఆర్. అలా దర్శకునిగా ఎవరి పేరూ ప్రకటించని రెండు చిత్రాలలో రామారావు నటించి విశేషాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ఆ రెండు చిత్రాలలో మొదటిది పౌరాణికం కాగా, రెండో చిత్రం జానపదం. అదే ‘గులేబకావళి కథ’.
ఈ రెండు చిత్రాల ద్వారా అవకాశాలు అందుకున్నవారు తరువాతి రోజుల్లో తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. యన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’కు ఎమ్.ఏ.రహమాన్ ఛాయాగ్రాహకులు. అందువల్ల తమ సొంత చిత్రాలకు సైతం ఆయననే సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. “పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ, పాండురంగమహాత్మ్యం” చిత్రాలకు రహమాన్ ఛాయాగ్రహణం నిర్వహించారు. ఈ నాలుగు చిత్రాలకు టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. అయితే టి.వి.రాజు వేరే చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి, మలి చిత్రాలకు స్వరకల్పన చేయలేకపోయారు. ఆ కారణంగా ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి గాలి పెంచల నరసింహారావు, ‘గులేబకావళి కథ’కు జోసెఫ్-కృష్ణమూర్తి సంగీతం సమకూర్చారు. ఈ రెండు చిత్రాలూ మ్యూజికల్ హిట్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక రహమాన్ సమయానికి షూటింగ్ కు రాకపోవడంతో ‘సీతారామకళ్యాణం’ ద్వారా రవికాంత నగాయిచ్ ను సినిమాటోగ్రాఫర్ గా చేసేశారు యన్టీఆర్. ఆయనే ‘గులేబకావళి కథ’కు కూడా ఛాయాగ్రహణం నిర్వహించారు. తరువాతి రోజుల్లో రవికాంత్ నగాయిచ్ దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్ అయ్యారు. ‘గులేబకావళి కథ’ ద్వారా డాక్టర్ సి.నారాయణరెడ్డిని గీతరచయితగా పరిచయం చేశారు రామారావు. ఆ పై సినిమా గీతాల్లో ప్రౌఢకవిత్వాన్ని ప్రవేశపెట్టిన ఘనతను సినారె సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే! అలా తన చిత్రాలకు పర్మినెంట్ గా పనిచేసేవారు లేకపోయినా, ధైర్యంగా ముందుకు సాగి, విజయాలను సొంతం చేసుకోవడం రామారావుకే చెల్లింది. ‘గులేబకావళి కథ’ చిత్రం 1962 జనవరి 5న సంక్రాంతి కానుకగా జనం ముందు నిలచింది.
నిజానికి ఈ కథకు ఆధారం ‘అరేబియన్ నైట్స్’లోని “గుల్-ఏ-బకావళి”. ఆ కథతోనే తమిళంలో యమ్.జి.రామచంద్రన్ హీరోగా 1955లో టి.ఆర్.రామన్న ‘గులేబకావళి’ రూపొందించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ ఛాయలు తన చిత్రంపై పడరాదని భావించిన యన్టీఆర్, ఈ కథకు చుట్టూ ‘సనాతన ధర్మం’ ఉండేలా చూసుకున్నారు. అందుకే టైటల్ ను ‘గులేబకావళి కథ’గా మార్చారు. అంతేకాదు, ఇందులో కథానాయకుని తల్లి అమ్మవారి భక్తురాలు. అదే తీరున అమ్మవారి ఆశీస్సులతో కథానాయకుడు విజయం సాధించి, గులేబకావళి పుష్పాన్ని తీసుకురావడం కథ.
ఈ సినిమా కథలోకి వెళ్తే – చంద్రసేన మహారాజుకు గుణవతి, రూపవతి అని ఇద్దరు భార్యలు. పెద్దభార్య గుణవతికి సంతానం ఉండరు. రూపవతికి ముగ్గురు కుమారులు. ముగ్గురూ తెలివిలేనివారే. రూపవతి తమ్ముడు వక్రకేతు రాజు సింహాసనంపై కన్నేసి ఉంటాడు. పెద్దభార్య ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. అతణ్ణి చూస్తే రాజుకు దృష్టి పోతుందని జ్యోతిషులతో చెప్పిస్తాడు వక్రకేతు. దాంతో రాజు, ఆ బిడ్డను అడవిలో వదలేసి రమ్మంటాడు. ఆ పసికందును చంపమని పురమాయిస్తాడు. ఆ బాబును అడవిలో వదలి వస్తారు భటులు. ఓ గొర్రెల కాపరికి ఆ బిడ్డ దొరుకుతాడు. పిల్లలు లేని గొల్లదంపతులు బాబును అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ఆ అబ్బాయికి విజయుడు అని పేరు పెడతారు. విజయ్ పెద్దవాడయి, ఓ సారి రాజును చూస్తాడు. అదే సమయంలో విషప్రయోగం కారణంగా రాజు చూపు పోతుంది. అందుకు, ఆ విజయుడే కారణమని, అతనిలో పెద్దరాణి పోలికలు ఉన్నాయని వక్రకేతు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న విజయుడు తనను పెంచినవారిని నిజం చెప్పమంటాడు. వారు తమకు అడవిలో దొరికావని చెబుతారు. రాజే తన తండ్రి అని తెలుసుకున్న విజయుడు నాన్న చూపుకోసం గులేబకావళి పుష్పం తీసుకు రావడానికి బయలు దేరతాడు. అదే సమయంలో రూపవతి కుమారులు కూడా పుష్పం కోసం వస్తారు. వారంతా యుక్తిమతి చేతిలో ఓడిపోయి జైలు పాలవుతారు. విజయుడు పాచికలాటలో యుక్తిమతిని ఓడించి, ఆమెను పెళ్ళాడతాడు. తరువాత దేవలోకం పోయి, పున్నమికి వికసించే గులేబకావళి పుష్పం కోసం వేచిఉంటాడు. అక్కడ దేవలోక రాజు కుమార్తె గులేబకావళిని ప్రేమిస్తాడు. పువ్వు తీసుకొని పోతాడు విజయుడు. కానీ, అతని అన్నలు విజయుని కొట్టి, ఆ పువ్వును తస్కరిస్తారు. ఒంటరివాడయిన విజయుడు ఓ స్త్రీకి శాపవిమోచనం కలిగిస్తాడు. ఆమె సాయంతో మళ్ళీ దేవలోకం పోతాడు. అప్పుడు తన కారణంగా గులేబకావళి బందీ అయిందని తెలుసుకుంటాడు. స్వర్ణపుష్పం వికసించే కొలను భస్మరాశిగా మారివుంటుంది. తన కళ్ళను బలిదానం చేయడంతో మళ్ళీ స్వర్ణకొలనుగా మారుతుంది. అతని త్యాగనిరతికి మెచ్చి, గులేబకావళిని ఇచ్చి పెళ్ళి చేస్తాడు రాజు. మళ్ళీ గులేబకావళి పుష్పం తాకిడితో విజయునికి కంటి చూపు వస్తుంది. చివరకు వక్రకేతును అంతమొందించి, తండ్రికి చూపు తెప్పించి, తాను ఇద్దరు భార్యలతో రాజు అవుతాడు విజయుడు.
‘గులేబకావళి’ కథకు పలు మార్పులు చేసినది సముద్రాల జూనియర్. ఇక ఈ సినిమాతోనే చిత్రసీమలో ప్రవేశించిన సినారె పది పాటలు రాశారు. అన్ని పాటలూ జనాదరణ పొందాయి. ముఖ్యంగా ఇందులోని “నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ…” పాట ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. “మదనా సుందర నా దొరా…”, “ఉన్నది చెబుతా వింటారా…”, “అంబా…జగదంబా నా ఆర్తినే ఆలించవా…”, “పందేనికి మేం పిలిచాము..”, “అస్సాలమ లేకుమ్…”, “కలల అలలపై తేలె…”, “ఒంటరినై పోయాను…” , “విన్నారా తత్వం గురుడా…”, “మాతా… జగన్మాతా…” పాటలు అలరించాయి.
ఈ చిత్రంలో యుక్తిమతిగా జమున, గులేబకావళిగా నాగరత్న అభినయించారు. ముక్కామల, ఋష్యేంద్రమణి, రాజనాల, ఛాయాదేవి, పేకేటి, పద్మనాభం, లంకాసత్యం, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత, నల్ల రామ్మూర్తి, సురభి బాలసరస్వతి తదితరులు నటించారు. యన్టీఆర్ తమ్ముడు యన్.త్రివిక్రమరావు ఈ చిత్రానికి నిర్మాత.
అరేబియన్ నైట్స్ లోని ‘గులేబకావళి’కి మార్పులు చేయగా, అచ్చు అంతకు ముందు యన్టీఆర్ తో కేవీ రెడ్డి తెరకెక్కించిన ‘జగదేకవీరుని కథ’ లాగే ఈ ‘గులేబకావళి కథ’ అనిపిస్తుంది. పైగా అందులోనూ యన్టీఆర్ కు ఋష్యేంద్రమణి, ముక్కామల తల్లిదండ్రులుగా నటించారు. అందులో యన్టీఆర్ తమ్మునిగా కనిపించిన లంకా సత్యం ఇందులో ఆయన అన్నల్లో ఒకరిగా దర్శనమిచ్చారు. పైగా ఋష్యేంద్రమణిపై చిత్రీకరించిన “అంబా…జగదంబా…” పాట, ‘జగదేకవీరుని కథ’లోని “నను దయగనవా…నా మొరవినవా…” పాటను తలపిస్తుంది. ఇక అందులో తన గానంతో రాతిని కరిగించే సమయంలో హీరో “శివశంకరీ…” పాట పాడతాడు. ఇందులో భస్మరాశి అయిన కొలనులో బంగారు జలం ఊరడానికి పాడే పాట కూడా అమ్మవారిపై , “మాతా…జగన్మాతా…” అంటూ సాగడం విశేషం. ఇలా పలు కోణాల్లో ‘జగదేకవీరుని కథ’ను గుర్తుకు తెస్తుంది ‘గులేబకావళి కథ’. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా విజయపథంలో నడిపించారు జనం. అదే యన్టీఆర్ లోని మ్యాజిక్ అనిపించక మానదు. ఆ తరువాత కూడా యన్టీఆర్ నటించిన పాత కథలతోనే ఆయన తరువాతి చిత్రాలు రూపొంది అఖండ విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ‘జగదేకవీరుని కథ’, ‘గులేబకావళి కథ’ మధ్య వ్యవధి కేవలం ఐదు మాసాలే. అయినా, ఈ చిత్రం కూడా విజయకేతనం ఎగురవేయడం విశేషం. అలాగే 1981లో కూడా ‘కొండవీటి సింహం’ వచ్చిన 8 నెలలకు వచ్చిన యన్టీఆర్ ‘జస్టిస్ చౌదరి’లోనూ పలు పోలికలు కనిపిస్తాయి. ఆ రెండు సినిమాలు కూడా బంపర్ హిట్ కావడం గమనార్హం! ఇలా రామారావు గ్లామర్ ఈ చిత్రాలకు పెద్ద ఎస్సెట్ అని చెప్పక తప్పదు. ‘గులేబకావళి కథ’ చిత్రం అప్పట్లో పోటీ సినిమాలకు దీటుగా సాగి విజయం సాధించడం చర్చనీయాంశమయింది.