హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సీటీమార్’ కమర్షియల్ సక్సెస్ ను సాధించింది, అతన్ని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. దాంతో ఇప్పటికే తొలికాపీ సిద్ధం చేసుకున్న గోపీచంద్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోపీచంద్, నయనతార తొలిసారి జంటగా నటించిన ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకుడు. జయబాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను అక్టోబర్ మాసంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. వక్కంతం వంశీ కథను అందించిన ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాశారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఇందులో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.