Ghantasala Daughter: మ్యూజిక్ సెన్సేషన్ ఘంటసాల గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆయన లేనిదే సినిమానే లేదు. ఎన్ని పాటలు.. ఎన్ని పాట కచేరీలు.. సినిమా ఏదైనా ఘంటసాల ఉండాల్సిందే.. ఆయన డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసేవాళ్ళు. ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు గురించి అస్సలు చెప్పనవసరమే లేదు. 1974 లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఇక ఆయన వారసులు కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నారని సమాచారం. తాజాగా ఘంటసాల చిన్న కుమార్తె సుగుణ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఘంటసాల మృతి చెందిన రోజున ఏం జరిగిందో ఆమె పూసగుచ్చినట్లు వివరించింది.
“చిన్నతనంలో మా ఇల్లు ఎప్పుడు సినీమా వాళ్ళతో కళకళలాడుతూ ఉండేది. అప్పట్లో పాటల రిహార్సల్స్ మా ఇంట్లోనే జరుగుతూ ఉండేది. అందుకే నిత్యం సినిమాకు సంబంధించిన వాళ్లు వస్తూపోతూ ఉండేవాళ్ళు. ఇక మాకు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూలు వేసేవారు. నా చిన్నతనం నుంచి మా నాన్నగారు చనిపోయేవరకు.. ఆయనకు కోపం రావడం నేను చూడలేదు. కనీసం నోరెత్తి గట్టిగా మాట్లాడింది కూడా లేదు. కొద్దిగా సమయం దొరికినా కూడా బంధువులతో పాటు తిరుపతికి వెళ్లిపోయేవారు. స్వామివారికి ఎదురుగా ఉన్న వాకిలిలో కూర్చొని పాటలు పాడేవారు. దాని విలువ ఏంటి అనేది నాకు అప్పుడు తెలియలేదు. నాన్నగారికి చిన్నప్పుడే షుగర్ వచ్చింది. అది తగ్గడానికి నాన్నగారు ఒక నాటు వైద్యుడు దగ్గర నాటు వైద్యం తీసుకున్నారు. దానివలన నాన్నగారి గొంతు కొట్టుకుపోయేది. రవీంద్ర భారతిలో ఏదో కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ తరువాత గొంతు కొట్టుకుపోయినప్పుడు రెండోసారి గుండెపోటు వచ్చింది. ఇక ఒకరోజు హాస్పిటల్ లో ఉంచి తరువాతి రోజు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఎంతో హుషారుగానే మాతో మాట్లాడారు.. ఇంటికి వచ్చాకా అందరం కలిసి బీచ్ కు వెళదామని ప్లాన్ కూడా వేసుకున్నాం. కానీ కొద్దిసేపటికే నాన్నగారికి మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చింది. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి నాన్నగారు చనిపోయారు.. ఆరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.