అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు దర్శకత్వం వహించాడు.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ పాటకు సంగీతం అందించారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బృంద కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటను ప్రత్యేకించి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదివరకే ఆయన్ను కోరింది. దీంతో ఈ పాటను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేయనున్నారు. కాపీరైట్ లేకుండా హెచ్‌డీలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు.