‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని నిర్మించారు. ఈ సినిమా జూలై 8న దాదాపు 500 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్ని థియేటర్లు ‘గంధర్వ’ దక్కించుకోవడం విశేషమే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా బెంగళూరు సహా ఓవర్సీస్ లో భారీ సంఖ్యలో ఈ సినిమా రిలీజ్ కానుండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘గంధర్వ’ చిత్ర విజయం పట్ల నిర్మాతలు సుభానీ, సురేశ్ కొండేటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ రిలీజ్ సందర్భంగా వారు మాట్లాడుతూ, ”సినిమా కంటెంట్ భిన్నమైంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇలాంటి సినిమాను చూడలేదు. తప్పకుండా దీనిని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ కు ముందే వివిధ వర్గాల వారిని ఎంపిక చేసి ప్రివ్యూ షోస్ వేశాం. వాళ్ళ నుండి చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ కారణంగానే ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం” అని అన్నారు. ‘గంధర్వ’ చిత్రానికి రాప్ ర్యాక్ షకీల్ సంగీతం అందించగా, ‘ఈశ్వర్’ ఫేమ్ జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సాయికుమార్, బాబూమోహన్, సురేశ్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు దర్శకుడు వీరశంకర్, శీతల్ భట్ కీలక పాత్రలను పోషించారు.