Dayanand: రొటీన్ కు భిన్నమైన చిత్రాలనే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని దయానంద్ తెరకెక్కించిన సినిమా ‘గేమ్ ఆన్’. ఇందులో అతని సోదరుడు గీతానంద్ హీరోగా నటించగా, నేహా సోలంకి హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాను రవి కస్తూరి నిర్మించారు. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్ టైమ్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ తెరకెక్కింది.
ఈ మూవీ గురించి నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, “‘రథం’ చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే సినిమా ఇది. గీతానంద్, దయానంద్ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఈ చిత్రం కోసం గొప్ప స్టార్‌క్యాస్ట్ తీసుకున్నాం. కీలక పాత్ర పోషించిన మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్ర ఇందులో చేశారు. న్యూఏజ్ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ‘కార్తికేయ 2’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్ ఈ సినిమాలో కూడా ఓ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. నేహా సోలంకి నటనతో పాటు అందచందాలతో కూడా ఆకట్టుకుంటారు. ‘శుభలేఖ’ సుధాకర్, కిరీటి, వాసంతి కీలక పాత్రలలో అలరిస్తారు. ఇటీవల విశ్వక్‌సేన్ విడుదల చేసిన టీజర్, అంతకు ముందు వచ్చిన పాటలకు స్పందన బావుంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మ్యూజిక్ బ్యాండ్ నవాబ్ గ్యాంగ్ అందించిన సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది. అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ పాడిన రెండో పాట ‘పడిపోతున్నా’ 2 రోజుల్లో 2 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. వినూత్న రీతిలో ప్రచారం చేసి, వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని అవి ఆకట్టుకుంటాయి” అని అన్నారు.