ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే అందులో టాలీవుడ్ యంగ్ హీరో గల్లా అశోక్ కూడా ఉన్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన గల్లా ఫ్యామిలీ పబ్ వివాదంతో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
Read also : Badshah : పాపులర్ సింగర్ కు యాంగ్జయిటీ డిజార్డర్… !
ఈ మేరకు ఓ మీడియా నోట్ ను విడుదల చేసిన గల్లా కుటుంబ సభ్యులు నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరును కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఇక ఈ పబ్ వివాదంలో డ్రగ్స్ పట్టుబడడం, నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహణ వంటి విషయాలతో ఈ కేసు మరింతగా ముదురుతోంది.