నటరత్న యన్.టి.రామారావు హీరోగా దర్శక-నిర్మాత బి.ఆర్.పంతులు తమ పద్మినీ పిక్చర్స్ పతాకంపై జనరంజకమైన చిత్రాలు రూపొందించారు. వాటిలో ‘గాలిమేడలు’ ఒకటి. 1962 ఫిబ్రవర 9న విడుదలైన ‘గాలిమేడలు’ విశేషాదరణ పొందింది. ఇందులో దేవిక నాయికగా నటించగా, యస్.వి.రంగారావు, చిత్తూరు నాగయ్య కీలక పాత్రలు పోషించారు.
‘గాలిమేడలు’ కథ విషయానికి వస్తే – రంగనాథం అనే షావుకారు టీబీ రోగంతో బాధపడుతూ ఉంటారు. తాను చికిత్స నిమిత్తం వెళ్తూ, తన కొడుకు కృష్ణ ఆలనాపాలనా పానకాలు అనే నమ్మకస్థునికి అప్పగిస్తాడు. రంగనాథం ఇచ్చిన పైకంతో వేరే ఊరువెళ్ళి పొలాలు కొని స్థిరపడతాడు పానకాలు. సొంతవూరివారికి తాము రంగూన్ పోతున్నట్టు చెబుతాడు. దాంతో అందరూ పానకాలు రంగూన్ వెళ్ళారని భావిస్తూ ఉంటారు. రంగనాథం వచ్చే సరికి పానకాలు రంగూన్ వెళ్ళాడని తెలుసుకొని తానూ అక్కడకు వెళతాడు. కొంతకాలానికి పానకాలుకు ఓ కొడుకు పుడతాడు. అతని పేరు మోహన్. అతణ్ణి చదివిస్తూ, కృష్ణను పొలం పనులకు వాడుకుంటాడు పానకాలు. అతని దూరం చుట్టం కూతురు లక్ష్మి, కృష్ణను ప్రేమిస్తుంది. లక్ష్మిని తన కొడుకు మోహన్ కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు పానకాలు. అయితే ఆమె కృష్ణను ప్రేమిస్తుందన్న విషయం తెలిసి, కృష్ణను ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. కానీ, పట్నంలో మోహన్, ఓ జమీందార్ కూతురును ప్రేమించి ఉంటాడు. ఈ విషయం తెలిసి, పానకాలు, లక్ష్మికి మాయమాటలు చెప్పి, కృష్ణను వెదికి తీసుకు రమ్మని చెబుతాడు. ఆమె అమాయకంగా కృష్ణకోసం పట్నం పోతుంది. కోటీశ్వరుడై తిరిగి వచ్చిన రంగనాథం, పానకాలు కోసం వెదుకులాట ప్రారంభిస్తాడు. ఏ రోజుకైనా తన కొడుకు తన దరి చేరుతాడని ఆశిస్తూ ఉంటాడు. అదే సమయంలో రంగనాథం ఇంట్లో కృష్ణ పనివాడుగా చేరి అతని అభిమానం సంపాదిస్తాడు. మోహన్ డబ్బు కోసమే తన కూతురిని ప్రేమించాడని, అతని తండ్రి పానకాలు కూడా మోసగాడని తెలుసుకున్న జమీందార్ వారిని బయటకు పంపుతాడు. కాలు కూడా పోగొట్టుకున్న పానకాలు బికారి అవుతాడు. పశ్చాత్తాపం చెందుతాడు. ఈ లోగా మోహన్ కు రంగనాథం విషయం తెలుస్తుంది. తానే అతని కొడుకునని ఆయన పంచన చేరతాడు. అక్కడ కృష్ణ, మోహన్ ను చూసి మోసం చేస్తున్నావని హెచ్చరిస్తాడు. ఆ రాత్రి రంగనాథం ను చంపాలని మోహన్ ప్రయత్నిస్తాడు. కృష్ణ రక్షిస్తాడు. పానకాలు కూడా అక్కడకు చేరుకొని, అసలు విషయం బయట పెడతాడు. మోహన్ తన కొడుకని, కృష్ణనే రంగనాథం తనయుడన్న నిజం చెబుతాడు. చివరకు కృష్ణ, లక్ష్మి పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో కృష్ణగా యన్టీఆర్, మోహన్ గా జగ్గయ్య, పానకాలుగా ఎస్.వి.రంగారావు, రంగనాథంగా చిత్తూరు వి.నాగయ్య, లక్ష్మిగా దేవిక నటించారు. మిగిలిన పాత్రల్లో జయంతి, రమణారెడ్డి, రాజనాల, సురభి బాలసరస్వతి, ఎమ్.వి.రాజమ్మ, విశ్వనాథం, పేకేటి శివరామ్, రమాదేవి, రాజేశ్వరి నటించారు.
ఎమ్.ఎస్.సోలమలై రాసిన మూలకథకు దాదా మిరాసి, పద్మినీ పిక్చర్స్ సంస్థ కథావిభాగం కలసి స్క్రీన్ ప్లే సమకూర్చారు. డి.వి.నరసరాజు మాటలు రాసిన ఈ చిత్రానికి సముద్రాల, కొసరాజు, ఆది శేషారెడ్డి, రామచంద్ పాటలు పలికించారు. టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు. తరువాతి రోజుల్లో కన్నడ నాట ప్రఖ్యాత దర్శకునిగా పేరొందిన ఎస్.ఆర్.పుట్టన్న కణగల్ ఈ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో బి.ఆర్.పంతులు నిర్మించారు.
“ఈ మూగ చూపేలా…బావా మాటడగా నేరమా…”, “మమతలు లేని మనుజులలోన…” పాటలను సముద్రాల రాయగా, “కృష్ణా…మంచి మాటేరా…”, “నవరాగాలు…” అంటూ సాగే పాటలను రామ్ చంద్ రాశారు. “ఓ రాయుడో…”, “గాలి మేడ కూలిపోయెరా…” పాటలను ఆదిశేషారెడ్డి రాయగా, “టీ షాపులోని పిల్లా…” పాటను కొసరాజు పలికించారు.
ఇదే కథతో కన్నడలో రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, లీలావతి ప్రధాన పాత్రధారులుగా ‘గాలి గోపుర’ పేరుతో బి.ఆర్.పంతులు ఓ చిత్రం రూపొందించారు. ‘గాలిమేడలు’ కంటే రెండు రోజులు ముందుగా ఆ సినిమా విడుదలయింది. రెండు చిత్రాలు విజయం సాధించాయి. చిత్రమేమంటే, బెంగళూరు, బళ్ళారి వంటి కేంద్రాలలో రెండు సినిమాలు ఒకే సమయంలో ప్రదర్శితమయ్యాయి. కన్నడనాట ఎంతో సుప్రసిద్ధమైన పురందరదాసు విరిచితమైన “యారిగే యారంటూ..” కీర్తనను చిత్రానికి అనువుగా ఉపయోగించుకున్నారు. అదే పాటను తెలుగులో సముద్రాల “మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ తనయులు ఎవరో…” అంటూ రాసి అలరించారు.