Kadapa: కడప మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కార్పొరేషన్‌లో మేయర్ పదవికి పోటీపడే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. బీసీకి రిజర్వుర్డ్ స్థానం కావడంతో కడప కార్పొరేషన్‌లో ఐదారుగురు బీసీ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే, మోజార్టీ కార్పొరేటర్లు వైసీపీ వైపే ఉండటంతో ఎవరిని మేయర్ స్థానంలో కూర్చోబెడతారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు అవినీతి ఆరోపణలతో మేయర్ పదవి నుంచి తొలగింపునకు గురైన మాజీ మేయర్ సురేష్‌బాబు తనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కోర్టుకు వెళ్లారు.. అయితే, ఇప్పటి దాకా మున్సిపల్ అధికారులు కౌంటర్ దాఖలు చేయలేదు. ఇదిలా ఉండగా కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో కార్పొరేషనల్‌లో రాజకీయ సందడి నెలకొంది.
Read Also: Hydera Commissioner Ranganath: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్..
అయితే, కొత్త నగర మేయర్ ఎవరన్నది మరో వారం రోజుల్లో తేలనుంది. అవినీతి ఆరోపణలతో మేయర్ పదవి కోల్పోయిన సురేష్‌బాబు స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్‌బేగంను ఇంఛార్జ్ మేయర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వచ్చే ఏడాది మార్చి వరకు కార్పొరేషన్ పదవీ కాలం ఉండటంతో కేవలం మూడున్నర నెలల కాలానికి కొత్త మేయర్‌ను ఎన్నుకునేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒక్కసారిగా కడప నగరంలో రాజకీయాలు వేడెక్కాయి.. ఈ నెల తొమ్మిదిన జిల్లా కలెక్టర్ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్, 11న ఎన్నిక జరగనుంది. ఏదైనీ కారణం చేత వాయిదా పడితే 12న నిర్వహిస్తారు. ఆరోజు కూడా జరగకపోతే తదుపరి తేదీని ప్రకటిస్తారు. మొత్తం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా ఇందులో 48 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులే గెలుపొందారు. ఒకే ఒక్క స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉమ, మరో డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్తి గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు అనారోగ్యకారణాలతో మృతి చెందారు. దీంతో వైసీపీ బలం 37 మంది కార్పొరేట్లు.
అంతేకాక టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడి మద్దతు ఉంది. టీడీపీ తరఫున ఉన్న తొమ్మిది మంది కార్పొరేటర్లు, కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వారి ఓట్లను కలుపుకుంటే టీడీపీ బలం 11కి మించదు. కొత్త మేయర్ పీఠంపై ఇప్పుడున్న బలాబాలా ప్రకారం వైసీపీకి చెందిన కార్పొరేటర్లలో ఉన్న ఐదుగురు బీసీ కార్పొరేటర్లలో ఎవరో ఒకరు మేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే బీసీ సామాజికవర్గం నుంచి కార్పొరేటర్లు పాకా సురేష్, బసవరాజు, మరో కార్పొరేటర్ యాదవ్, ఇంకో మహిళా కార్పొరేటర్ మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం మూడు నెలల పదవీ కాలానికి మేయర్‌గా ఉండటం అంటే కేవలం మేయర్ అనిపించుకోవడం తప్ప పెద్దగా ఉపయోగపడదు. అంతేకాక కార్పొరేషన్ పదవీ కాలం ముగిసేలోగా కేవలం ఒకే ఒక్క కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఉన్న బీసీ కార్పొరేటర్లలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందనే అంశంపై ఉత్కంఠ రేపుతోంది. వైసీపీలో అంతర్గతంగా ఉన్న వర్గ పోరు ఈ ఎన్నిక నేపథ్యంలో బహిర్గతం అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎంపిక ప్రక్రియను సజావుగా జరపకపోతే వచ్చే స్థానిక సంస్ధల ఎన్నికల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో కడప నగర కొత్త మేయర్ ఎంపిక వైసీపీ అధిష్టానికి ఒక సవాల్‌గా మారింది…