Chello Show:’చెల్లో షో’ సినిమాపై రోజురోజుకు విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ సినిమాను ఆస్కార్ కు ఎలా పంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా ‘చెల్లో షో’ ఆస్కార్ కు ఎంపికైన విషయం విడితమే. అయితే ఈ ఎన్నిక తప్పు అని ఖండించారు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్. అసలు ఈ సినిమా భారతీయ సినిమానే కాదని కొట్టిపడేశారు.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) మరోసారి తమ ఎంపికను సరిచూసుకోవాల్సిందిగా కోరారు. ఈ విషయమై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ మాట్లాడుతూ “‘చెల్లో షో’అసలు భారతీయ సినిమానే కాదు.. ఈ సినిమాను హాలీవుడ్ లాస్ట్ ఫిల్మ్ షో గా రిలీజ్ చేశారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ గా మరోసారి ఈ సినిమాను ఎలా ఎంపిక చేస్తారు.
ఫెడరేషన్ సభ్యుల్లో చాలామంది అసలు ఈ సినిమా చూడకుండానే నామినేట్ చేశారు. సిద్దార్ద్ రాయ్ కపూర్ ఈ సినిమాను కొనుగోలు చేశాడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆస్కార్ కు పంపారు.. పోటీలో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, కశ్మీరీ ఫైల్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. అవి భారతీయ సినిమాలు.. వాటిని నామినేషన్స్ లో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అసలు సినిమా చూడకుండానే ఆస్కార్ నామినేట్ చేయడం సిగ్గుచేటు.. భారతీయ సినిమాలకు అవమానం. ఒక హాలీవుడ్ సినిమాను ఇండియా తరుపున పంపడం ఇండియాకే చెడ్డపేరు. ఈ విషయమై మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలనుకుంటున్నాము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఆస్కార్ సభ్యులు కనీసం సినిమా కూడా చూడకుండా ఎలా నామినేట్ చేస్తారు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.