Forty Years for Pratikaram Movie
ఒకే టైటిల్ తో రూపొందిన చిత్రాలలో ఒకే హీరో నటించడమన్నది కొత్తేమీ కాదు. 1960ల చివరలో శోభన్ బాబు హీరోగా ‘ప్రతీకారం’ అనే చిత్రం రూపొందింది. అదే టైటిల్ తో 1982లో శోభన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ‘ప్రతీకారం’ విడుదలయింది. గుత్తా రామినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘ప్రతీకారం’ 1982 జూలై 22న విడుదలై మంచి ఆదరణ పొందింది.
ఈ ‘ప్రతీకారం’ కథ ఏమిటంటే – పోలీస్ కమీషనర్ కమల్ నాథ్ కు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శ్రీనాథ్ లాయర్, చిన్నవాడు శ్రీకాంత్ తండ్రిలాగే ఇన్ స్పెక్టర్. తండ్రి పెంపకంలో ఒకరు చట్టాన్ని రక్షించాలనుకుంటే, మరొకరు న్యాయాన్ని కాపాడాలని భావిస్తారు. అలెగ్జాండర్ అనే వాడు ఆ ఊరిలో తన పలుకుబడితో పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. శ్రీకాంత్, రంగా అనే రౌడీని అరెస్ట్ చేస్తాడు. తల్లి లేని రంగా కొడుకు ‘నాకు మా నాన్న కావాలి…’ అంటూ ఏడిస్తే పోలీస్ ఆఫీసర్ తన ఇంటికి తీసుకు వెడతాడు. ఆయన మంచితనంతో రంగా మారిపోతాడు. రంగాను ఎవరు అరెస్ట్ చేశారంటూ రంకెలు వేస్తున్న అలెగ్జాండర్ ను ‘ఒరేయ్ నాగరాజు’ అంటూ అసలు పేరుతో పిలుస్తాడు పోలీస్ కమీషనర్. పోలీస్ స్టేషన్ లో నాగరాజును అవమానించి పంపిస్తాడు కమల్ నాథ్. దాంతో వాడు పగపడతాడు. కమల్ నాథ్ ఏకైక పుత్రిక జ్యోతిని మానభంగం చేస్తాడు. అంతటితో ఆగకుండా ఓ ఆడదాన్ని తీసుకు వచ్చి, కమల్ నాథ్ కు ఆమెకు సంబంధం ఉందని గోల చేస్తాడు. ఆమె అన్నయ్యను కమల్ నాథ్ చంపేశాడని ఆమె ఇచ్చిన కంప్లయింట్ తో కమల్ నాథ్ ను అరెస్ట్ చేస్తాడు శ్రీకాంత్. కేసు కోర్టుకు వస్తుంది. సాక్ష్యాలు కమల్ నాథ్ కు వ్యతిరేకంగా ఉండడంతో జైలుకు వెళతాడు. అతని కూతురు చనిపోతుంది. జైలు నుండి పూచి మీద కమల్ నాథ్ ను తీసుకు వస్తాడు శ్రీకాంత్. ఆయన తప్పించుకుపోయి, నాగరాజును చంపాలనుకుంటాడు. ఆయనను అడ్డుకొనే ప్రయత్నంలో శ్రీనాథ్, శ్రీకాంత్ తలపడతారు. రంగా సైతం కమల్ నాథ్ కు సహకరిస్తాడు. కమల్ నాథ్, నాగరాజును చంపేసి, చట్టానికి లొంగిపోవడంతో కథ ముగుస్తుంది.
శ్రీనాథ్ మూవీస్ పతాకంపై రూపొందిన ‘ప్రతీకారం’లో మురళీమోహన్, మోహన్ బాబు, శారద, రావు గోపాలరావు, శారద, విజయశాంతి, శ్రీగంగ, రాళ్ళపల్లి, విజయలలిత, జయమాల, అను నటించారు. ఈ చిత్రానికి మూలకథ కొచ్చిన్ అనీఫా అందించగా,కాశీ విశ్వనాథ్ స్క్రిప్ట్ రాశారు. మోహన్ దాస్ మాటలు- కో డైరెక్షన్ చేశారు. వేటూరి, దాసం గోపాలకృష్ణ పాటలు పలికించారు. చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఈ చిత్రానికి కోగంటి భాస్కరరావు నిర్మాణ నిర్వహణ సాగించారు. ఆలపాటి రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. “తూనీగ నీ నడుము…”, “ఆకాశంలో చుక్కల్లారా…”, “నింగి నీలాల సాక్షి…”, “అబ్బో చిందరవందర గందరగోళం…” అంటూ సాగే పాటలు అలరించాయి.
తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత అయిన ఎ.ఎమ్.రత్నం ఇందులో కమెడియన్ చిట్టిబాబు ఫ్రెండ్ గా కాసేపు తళుక్కుమన్నారు.ఈ చిత్రంలో శోభన్ బాబు కూతురు జ్యోతిగా నటించింది ఒకప్పటి ప్రముఖ నటి గిరిజ కూతురు శ్రీగంగ. ఈ సినిమాలోనే ఆమె తొలిసారి నటించింది. ‘ప్రతీకారం’ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.