తెలుగు చిత్రసీమలో పలు రికార్డులకు నెలవుగా నిలిచారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినోత్సవ కానుకలుగా అనేక చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు విడుదలైన చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది యన్టీఆర్ కెరీర్ లోనే అధికంగా చూస్తాం. యన్టీఆర్ బర్త్ డేకు విడుదలై విజయం సాధించిన అన్ని చిత్రాల్లోకి అనూహ్య విజయం సాధించిన చిత్రంగా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ సినిమా 1982 మే 28న యన్టీఆర్ జన్మదినోత్సవ కానుకగా ప్రేక్షకులను రంజింపచేసింది.
‘జస్టిస్ చౌదరి’ కథ ఏమిటంటే- చట్టానికి, న్యాయానికి, ధర్మానికి విలువనిచ్చే వ్యక్తి జస్టిస్ ఆర్.కె. చౌదరి. ఆయనకు భార్య, ఓ కొడుకు, ఓ మూగ కూతురు, మేనకోడలు ఉంటారు. చౌదరి కొడుకు రాజా పోలీస్ ఇన్ స్పెక్టర్. మూగ కూతురుకు ఓ మంచి అబ్బాయి దొరికితే బాగుంటుందని చౌదరి దంపతులు ఆశిస్తూ ఉంటారు. ఇక మొదటి నుంచీ చౌదరిని వ్యతిరేకించే లాయర్ కైలాసం తప్పుడు మార్గంలో నడుస్తూ పాపారావు అనే స్మగ్లర్ కు సహాయ పడుతూ ఉంటాడు. పాపారావు తమ్ముడు ఓ వ్యక్తిని హత్య చేయడంతో జస్టిస్ చౌదరి అతనికి ఉరిశిక్ష విధిస్తాడు. అప్పటి నుంచీ చౌదరి కుటుంబంపై పగబట్టి ఉంటాడు పాపారావు. అదే ఊరిలో రాము అనే మెకానిక్, కారు రేసులు ఆడేస్తూ ఉంటాడు. అతని స్పీడ్ చూసిన పాపారావు, రామును తన స్మగ్లింగ్ వస్తువులను సరైన చోటకు చేర్చడానికి వాడుకుంటూ ఉంటాడు. చౌదరి కూతురును ఓ వ్యక్తి పెళ్ళి చేసుకుంటాడు. అతని తండ్రిని బంధించి, అతని ద్వారా చౌదరిని లొంగ దీసుకోవాలని చూస్తారు. చౌదరి ఏ మాత్రం చలించడు. న్యాయం వైపే నిలబడతాడు. మెకానిక్ రామును కైలాసం కూతురు రేఖ ప్రేమిస్తుంది. అది నచ్చని కైలాసం రాము గ్యారేజ్ కు వెడతాడు. అక్కడ రాము తల్లి రాధ ఫోటో చూస్తాడు. రాముకు, అచ్చు చౌదరి పోలికలు ఉండడం గమనిస్తాడు. దాంతో అతనికి చౌదరి చదువుకొనే రోజుల్లో రాధను ప్రేమించాడని, వారిద్దరికి పుట్టిన కొడుకే రాము అని అర్థం చేసుకుంటాడు. ఆ విషయం పాపారావుకు చెప్పడం, అతను రాముకు ఈ విషయం చెప్పి నీ తల్లిని చౌదరి మోసం చేశాడని చెబుతాడు. దాంతో రాము చౌదరిపై పగ పెంచుకుంటాడు. చౌదరి వేషం వేసుకొని అతని కొడుకు ఇన్ స్పెక్టర్ రాజాను ఓ కేసులో ఇరికిస్తాడు రాము. చౌదరి కోర్టుకే ఆ కేసు వస్తుంది. ఏమి అడిగినా రాజా మౌనం వహిస్తాడు. తరువాత రాజాను జైలులో కలుసుకొని విషయం తెలుసుకుంటాడు. మీరే నాకు డబ్బు ఇచ్చారు కదా డాడీ అంటాడు రాజా. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా అని అడగ్గా, రాము అనే వ్యక్తి తనను చూసి గేలి చేశాడని చెబుతాడు. రాము మెకానిక్ షెడ్ కు చౌదరి వెళతాడు. అక్కడ అతను కూడా రాధ ఫోటోను చూసి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. రాము తల్లి రాధ కొడుకు చేసిన నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళ్ళి వస్తుంది. ఆమె కోసం ఓ ఇల్లు కట్టిస్తాడు రాము. అందుకోసమే తప్పు, ఒప్పు అన్నది చూడకుండా డబ్బు సంపాదిస్తాడు రాము. చౌదరిని చూశాక రాధకు అన్ని విషయాలు తెలుస్తాయి. తానే కావాలని చౌదరి జీవితం నుండి తప్పుకున్నానని రాముకు రాధ చెబుతుంది. తల్లి చెప్పాక తప్పు తెలుసుకుంటాడు రాము. ఈ లోగా పాపారావు చౌదరి కుటుంబాన్ని బంధించి చంపాలని చూస్తాడు. చౌదరి, రాము వెళ్ళి కాపాడుకుంటారు. చివరలో చౌదరిని చంపచూస్తాడు పాపారావు. అందుకు అడ్డు పడ్డ రాధ కన్నుమూస్తుంది. రాము పాపారావు కారును తన కారుతో గుద్దేస్తాడు. లోయలోపడి పాపారావు చస్తాడు. తన పెద్ద కొడుకు రామును చౌదరి ఇంటికి తీసుకువెడతాడు. పాపారావే అసలు దోషి అని కోర్టు, రాజాను విడుదల చేస్తుంది. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో జస్టిస్ చౌదరి, రాము పాత్రల్లో యన్టీఆర్ తనదైన బాణీ పలికించారు. మరో విశేషం ఇదే చిత్రంలో విలన్ గా నటించిన సత్యనారాయణ కూడా ద్విపాత్రాభినయం చేయడం. శ్రీదేవి, శారద, జయంతి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నగేశ్, శ్రీధర్, ముచ్చర్ల అరుణ, రాజ్యలక్ష్మి, సుభాషిణి, రాజా, చలపతిరావు తదితరులు నటించారు. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, వేటూరి పాటలు పలికించారు. చక్రవర్తి బాణీలు కట్టారు. ఇందులోని ఏడు పాటలూ విశేషాదరణ చూరగొన్నాయి. “ముద్దు మీద ముద్దు పెట్టు…”, “ఒకటో నంబర్ చిన్నదంట…”, “శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం…”, “చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో…”, “నీ తొలి చూపులోనే…”, “అబ్బ ముసురేసింది…”, “నీ చెక్కిలి వెల ఎంత…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘జస్టిస్ చౌదరి’ చిత్రం అనగానే నటరత్న యన్టీఆర్ నటనావైభవం మన కళ్ళముందు కదలాడుతుంది. ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషన్ సీన్స్ లో ఆయన అభినయం అలరిస్తుంది. “చట్టానికి న్యాయానికి…” పాటలో యన్టీఆర్ హావభావాలు జనాన్ని థియేటర్లకు పరుగులు తీయించాయి. ఆ తరువాత ఎంతోమంది నటులు నటరత్నను బ్లాక్ కోటులో అనుకరించడం విశేషం! ఈ సినిమా 32 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆరు కేంద్రాలలో రజతోత్సవం, ఓ కేంద్రంలో 250 రోజులు ప్రదర్శితమయింది. ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ‘జస్టిస్ చౌదరి’ పేరుతోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తెరకెక్కించారు. తమిళంలో శివాజీ గణేశన్, ప్రభుతో ‘నీతిబతి’ పేరుతోనూ, మళయాళంలో ప్రేమ్ నజీర్ హీరోగా ‘జస్టిస్ రాజా’ పేరుతోనూ రీమేక్ చేశారు. ఇదే తీరున ఏయన్నార్ ద్విపాత్రాభినయంతో దాసరి నారాయణరావు ‘జస్టిస్ చక్రవర్తి’ అనే చిత్రాన్ని రూపొందించి, అక్కినేని బర్త్ డే కానుకగా 1984 సెప్టెంబర్ 20న విడుదల చేశారు. ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది.
ఇక 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన రెండు నెలలకే ‘జస్టిస్ చౌదరి’ విడుదలయింది. ఈ సినిమా విడుదలైన రోజున తిరుపతిలో తెలుగుదేశం తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అలాగే ‘జస్టిస్ చౌదరి’కూడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. ఈ చిత్రం విడుదలైన 42 రోజులకే యన్టీఆర్ సంచలన చిత్రం ‘బొబ్బిలిపులి’ జనం ముందు నిలచింది. ఆ సినిమా కలెక్షన్ల తుఫాన్ ముందు కూడా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. 1982 టాప్ గ్రాసర్స్ లో ‘బొబ్బిలిపులి’ తరువాతి స్థానంలో ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ రెండు చిత్రాలు 250 రోజులకు పైగా ప్రదర్శితం కావడం మరింత విశేషం!