బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా సాగిన ధర్మేంద్ర, జితేంద్ర ఇద్దరూ కలసి అనేక చిత్రాలలో నటించారు. అయితే వారిద్దరూ నటించిన చిత్రాలలో బిగ్ హిట్ గా నిలచిన చిత్రం ‘ధరమ్-వీర్’ అనే చెప్పాలి. ఈ సినిమా సమయంలో ధర్మేంద్ర, జితేంద్ర మధ్య సయోధ్య లేదని, వారిద్దరూ అప్పట్లో హేమామాలిని కోసం పోట్లాడుకున్నారనీ విశేషంగా వినిపించేది. ఈ నేపథ్యంలో విడుదలైన చిత్రం కాబట్టి ‘ధరమ్-వీర్’ ను జనం కూడా విశేషంగా ఆదరించారు. పైగా ‘షోలే’ తరువాత ధర్మేంద్ర ఇతర హీరోలతో నటించిన చిత్రాలకూ విశేషాదరణ లభిస్తూ వచ్చింది. ఆ విధంగానూ జానపద చిత్రం ‘ధరమ్-వీర్’కు క్రేజ్ దక్కింది. అప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన మన్మోహన్ దేశాయ్ సినిమా కావడంతోనూ ‘ధరమ్-వీర్’కు ఆ రోజుల్లో బజ్ క్రియేట్ అయింది. ఇలా పలు విశేషాలతో 1977 సెప్టెంబర్ 6న ‘ధరమ్-వీర్’ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది. ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది.
‘ధరమ్-వీర్’ కథలోకి తొంగి చూస్తే – రాకుమారి మీనాక్షిని ఓ సారి అడవిలో కొందరు చుట్టుముడతారు. వారి బారి నుండి ఆమెను జ్వాలాసింగ్ రక్షిస్తాడు. వారు ప్రేమించుకుంటారు. ఒకటవుతారు. అడవిలో పులి ఓ వ్యక్తిని చంపేస్తుంది. ఆ చనిపోయిన వ్యక్తిపై తన దుస్తులు వేస్తాడు జ్వాలాసింగ్. పులితో పోరాడి దానిని చంపేసి, తానూ ప్రాణాలు వదలుతాడు జ్వాలా. అయితే రాకుమారి చనిపోయిన వ్యక్తిపై జ్వాలా దుస్తులు చూసి అతనే చనిపోయాడని భావిస్తుంది. అప్పటికే ఆమె గర్భవతి. ఓ బాబుకు జన్మనిస్తుంది. తన తొలి మేనల్లుడి కారణంగా ఆపద ఉందని మీనాక్షి అన్న సప్తాల్ భావిస్తాడు. దాంతో ఆ బాబును సప్తాల్ పారేస్తాడు. జ్వాలాసింగ్ వద్ద ఉండే డేగ, ఆ బాబును ఎత్తుకు పోతుంది. పక్షి తీసుకు వచ్చిన బాబు పిల్లలులేని దంపతులకు దొరుకుతాడు. అయితే అక్కడ కోటలో మీనాక్షి కొంత సమయానికి మరో బాబుకు కూడా జన్మనిస్తుంది. చిన్న మేనల్లుడి ద్వారా తనకు హాని లేదని భావించిన నఫ్తాల్ ఆ బాబును ఏమీ చేయడు. అడవిలోని బాబు ధరమ్ గానూ, కోటలోని బాబు వీర్ గానూ పెరుగుతారు. ధరమ్ ను మరో రాకుమారి పల్లవి ప్రేమిస్తుంది. వీర్, పల్లెటూరి అమ్మాయి రూపాను ప్రేమిస్తాడు. మీనాక్షి దేశంలో కంటికి కన్ను అనే న్యాయం సాగుతూ ఉంటుంది. ఓ సారి ఆ న్యాయం వల్ల ఓ పేదవాడి ప్రాణం తీస్తారు. అది చూసి ధరమ్ చలించి పోతాడు. అయితే ధరమ్ ను పెంచిన తల్లి రాజభటుల కారణంగా ప్రాణం వదలుతుంది. రుజువు చూపి, తనకు న్యాయం చేయమంటాడు ధరమ్. తన తల్లిని ఇవ్వమంటాడు. దాంతో మీనాక్షి స్వయంగా అతని తల్లిగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ధరమ్ పెంపుడు తండ్రి చూపిన ఆధారాలతో అతను తన కొడుకే అని తెలుసుకుంటుంది మీనాక్షి. ధరమ్, వీర్ మధ్య వైరం ఏర్పడుతుంది. ఇద్దరూ పోరాడుతారు. నిజం తెలుసుకొని అసలు తాము విడిపోవడానికి కారకుడైన మేనమామ సప్తాల్ ను తుదముట్టిస్తాడు ధరమ్. అలా జోస్యం ఫలిస్తుంది. చివరకు ధరమ్-వీర్ తాము ప్రేమించిన వారి చేయి అందుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ధరమ్ గా ధర్మేంద్ర, వీర్ గా జితేంద్ర నటించిన ఈచిత్రంలో జీనత్ అమన్, నీతూ సింగ్, ప్రాణ్, ఇంద్రాణీ ముఖర్జీ, జీవన్, రంజిత్, సుజిత్ కుమార్, దేవ్ కుమార్, ప్రదీప్ కుమార్, బి.ఎమ్.వ్యాస్, ఆజాద్, డి.కె.సప్రూ, నీలమ్ నటించారు. చిన్నప్పటి ధరమ్ గా ధర్మేంద్ర చిన్న కొడుకు బాబీ డియోల్ కనిపించడం విశేషం!
ఈ చిత్రానికి నటరచయిత ఖాదర్ ఖాన్ సంభాషణలు పలికించారు. ఆనంద్ బక్షి పాటలకు లక్ష్మీకాంత్- ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు. ఇందులోని “మై గలియోంకీ రాజా…తూ మెహలోం కీ రాణీ…”, “బంద్ హో ముఠ్ఠీ తో లాఖ్ కీ…”, “హమ్ బంజారో కీ బాత్ మత్ పూచో జీ…”, “సాత్ అజూబే ఇస్ దునియా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి ఇందులోని “ఓ మెరి మెహబూబా…” పాట యువతను ఊపేసింది. ‘ధరమ్-వీర్’ చిత్రం బంపర్ హిట్ గా నిలచింది. కొన్ని కేంద్రాలలో రజతోత్సవం చూసింది.
నాటి టాప్ స్టార్స్ అందరితోనూ మన్మోహన్ దేశాయ్ సినిమాలు తెరకెక్కించి అలరించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘నసీబ్’లో అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, రిషి కపూర్ హీరోలుగా నటించారు. అందులో “జాన్ జానీ జనార్దన్…” పాటలో ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, రాజ్ కపూర్, రణధీర్ కపూర్, రాకేశ్ రోషన్ వంటి హీరోలు కనిపించడం విశేషం! ఆ పాట ‘ధరమ్-వీర్’ సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగే నేపథ్యంలోనే రూపొందినట్టుగా తెరకెక్కించడం విశేషం! ఈ ‘నసీబ్’ తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘త్రిమూర్తులు’ పేరుతో తెరకెక్కింది. అందులోనూ శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ పాటలో కనిపిస్తారు. 1977లో మన్మోహన్ దేశాయ్ ధర్మేంద్ర, రణధీర్ కపూర్ తో ‘చాచా బతిజా’ తీశారు. అలాగే అమితాబ్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ తో ‘అమర్ అక్బర్ ఆంటోని’, అమితాబ్, వినోద్ ఖన్నాతో ‘పర్వరిష్’ రూపొందించారు. ఆ యేడాది మన్మోహన్ తెరకెక్కించిన ఈ నాలుగు చిత్రాలు టాప్ టెన్ గ్రాసర్స్ లో చోటు దక్కించుకోవడం విశేషం! ఆ యేడాది నంబర్ వన్ స్థానంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ నిలవగా, రెండో స్థానంలో ‘ధరమ్ వీర్’ నిలచింది.