Ram Sethu Teaser: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాక్వలిన్ పెర్నాండజ్ జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం రామసేతు. లైకా ప్రొడక్షన్స్- కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్- అబుందాంటియా ఎంటర్టైన్మెంట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. “రామసేతును రక్షించడానికి మనకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి”అని అక్షయ్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది.
సినిమా మొత్తం విజువల్ వండర్ గా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. రామసేతును కాపాడడానికి ఆర్కియాలజిస్ట్ అక్షయ్ తన టీమ్ తో కలిసి చేసిన సాహసం ఏంటి..?.. చివరికి అక్షయ్ అనుకున్నది సాధించాడా లేదా అనేది కథగా తెలుస్తోంది. ఇక టీజర్ లో ఆర్కియాలజిస్ట్ గా అక్షయ లుక్, నటన ఆకట్టుకుంటున్నాయి. అక్షయ్ కు నిత్యం తోడుగా ఉన్నట్లు జాక్వలిన్ కనిపించింది. ఇక సత్య దేవ్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. చివర్లో సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడ ఒక దీవిని కనుక్కోవడం లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ చూపించారు. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు. గత కొన్ని రోజులుగా వరుస ప్లాపులను అందుకుంటున్న అక్షయ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అక్షయ్ కు ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.