మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే తేదీన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ సైతం రిలీజ్ అవుతోంది. చిత్రం ఏమంటే… ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విష్ణు విశాల్ తమిళంలో ‘భీమిలి కబడ్డి జట్టు, రాక్షసుడు’ చిత్రాలలో నటించాడు. అవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యి చక్కని విజయం సాధించాయి. అలానే ఇటీవల వచ్చిన రానా ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. అతని తాజా చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్.’. దీన్ని తమిళంలో అతనే సొంత బ్యానర్ లో నిర్మించాడు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ పొందింది. రవితేజ సమర్పణలో ఈ మూవీని తెలుగులో తమిళంతో పాటే ఫిబ్రవరి 11న రిలీజ్ చేయబోతోంది.
సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐఎస్ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా కారణంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనేది ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూలకథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో జరుగుతుంది. ‘ఈ సినిమా ప్లాట్ చాలా గమ్మత్తుగా ఉంటుందని, అన్నిభాషల్లో మంచి బజ్ నెలకొందని, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో కీలక పాత్ర పోషించార’ని విష్ణు విశాల్ తెలిపాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. అన్నట్టు తమిళ హీరో విష్ణు విశాల్ ఇటీవలే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను వివాహం చేసుకున్నాడు.