ఫిలిమ్ నగర్ నడిబొడ్డున ఫిలిమ్ ఛాంబర్ కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ నాటికీ హైదరాబాద్ మహానగరంలో ఫిలిమ్ ఛాంబర్ ఓ ల్యాండ్ మార్క్ గా నిలచే ఉంది. ఛాంబర్ చెంతనే భక్తకోటి కోసం అన్నట్టుగా దైవసన్నిధానం వెలసింది. మరోవైపు ‘ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్’ కూడా చోటు చేసుకుంది. ఇక ఛాంబర్ లోనే సినిమా రంగానికి చెందిన ప్రధాన సంఘాల కార్యాలయాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్కింగ్ కు ఇబ్బందులు కలుగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం నెలకొన్న ఛాంబర్ భవనాన్ని సమూలంగా కూల్చివేసి, దాని స్థానంలో సినీజనానికి పలు సౌకర్యాలతో నూతన భవంతి నిర్మాణం చేపట్టనున్నారు.
కొత్తగా కట్టబోయే భవంతిలో మరిన్ని ఫ్లోర్స్ ఏర్పాటు చేసి, వాటిలో సినిమా రంగానికి చెందిన వారికే ప్రాధాన్యమిస్తూ ఆఫీసులు ఏర్పాటు చేసుకొనే వీలు కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలకు మరింత మెరుగులు అద్దే ప్రయత్నమూ జరగనుంది. ఇకపై దేవాలయానికి, ఛాంబర్ కు, కల్చరల్ క్లబ్ కు వెళ్ళే వారి పార్కింగ్ కు ఏ లాంటి అసౌకర్యం కలుగకుండా ‘పార్కింగ్’ కోసం అనువైన ప్రణాళికను కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. మరి అది ఎప్పుడు ఎలా కార్యరూపం దాలుస్తుందో చూడాలి.