Site icon NTV Telugu

Tollywood Progress Report: ఈ మాసం ‘సార్’ దే!

Tpr

Tpr

Tollywood: ఈ యేడాది జనవరిలో అనువాద చిత్రాలతో కలిపి కేవలం 15 సినిమాలు విడుదల కాగా.. ఫిబ్రవరి నెలలో మొత్తం 22 సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో 19 స్ట్రయిట్ చిత్రాలు, మూడు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి.

ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఆరు చిత్రాలు విడుదల కాగా సందీప్‌ కిషన్ నటించిన ‘మైఖేల్’పై పలువురు భారీ ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో విడుదలైన ఈ సినిమా ఆ ఆశలను వమ్ము చేసింది. అదే వారం వచ్చిన ‘ప్రేమదేశం, రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం, సువర్ణ సుందరి’ తదితర చిత్రాలు సైతం పెద్దంత మెప్పించలేకపోయాయి. అయితే హాస్యనటుడు సుహాస్ హీరోగా రూపుదిద్దుకున్న ‘రైటర్ పద్మభూషణ్‌’ వినోదంతో పాటు సందేశాన్ని అందించి, పలువురిని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఇక మలయాళ రీమేక్ గా వచ్చిన ‘బుట్టబొమ్మ’ తెలుగువారిని మాత్రం మెప్పించలేకపోయింది.

సెకండ్ వీకెండ్ లో కన్నడ అనువాద చిత్రం ‘శివ వేద’తో పాటుగా ఏడు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’కు రిలీజ్ ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేదు. జనవరిలో ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మైత్రీ మూవీమేకర్స్ సంస్థకు ‘అమిగోస్’ హ్యాట్రిక్ ను అందించలేకపోయింది. ఇక త్రిగుణ్‌, అవికాగోర్ జంటగా నటించిన ‘పాప్ కార్న్’, బాబీ సింహా హీరోగా నటించిన ‘వసంత కోకిల’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.

థర్డ్ వీకెండ్ లో వచ్చిన ధనుష్‌ ‘సార్’ చిత్రం చక్కని విజయాన్ని అందుకుని ఈ నెలలోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ధనుష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా తమిళంలోనూ, కథలోని విలువల కారణంగా తెలుగులోనూ మూవీ పాసైపోయింది. అంతే కాదు… ఫస్ట్ వీకెండ్ లో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సార్’, 25వ తేదీకి వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో.. ఈ నెలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఈ సంస్థ నుండి వచ్చిన ‘బుట్టబొమ్మ’ పరాజయం పాలు కాగా ఆ లోటును ‘సార్’ సక్సెస్ తీర్చేసింది. ఇక ‘సార్’తో పాటు వచ్చిన కిరణ్‌ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు పాజిటివ్ టాక్ వచ్చినా… కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. అయితే… జీఎ 2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఈ నెల లాస్ట్ వీకెండ్ లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘కోనసీమ థగ్స్’ మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది. ఏదేమైనా… ఫిబ్రవరిలో విడుదలైన 22న చిత్రాలలో లాభాలు గడించిన చిత్రాలు రెండు, మూడు మించి లేకపోవడం బాధాకరం!!

Exit mobile version