Priya Bhavani Shankar: ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ప్రియ భవాని శంకర్. యంగ్ హీరో సంతోష్ శోభన్ తో అనిల్ కుమార్ ఆళ్ళను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ శనివారం విడుదల కాబోతున్న సందర్భంగా ప్రియ భవాని మీడియాతో మాట్లాడుతూ, ”తమిళ్ లో నేను చాలా మంచి చిత్రాలు చేశాను. యువి కాన్సెప్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ తో తెలుగు లో లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి కథతో తెరకెక్కిన చిత్రం ఇది. నాకు ఇది తొలి తెలుగు సినిమా అయితే… సెట్స్ లో ప్రామ్టింగ్ అనేది నాకు నచ్చదు. డైలాగ్స్ చెప్పే విషయంలో హీరో సంతోష్ శోభన్ ఎంతో హెల్ప్ చేశారు’ అని చెప్పింది.
కథ గురించి వివరిస్తూ, ”ఇగో సమస్యలు లేని ఒక భార్య భర్త మధ్య జరిగిన సంఘటనలు, వాటితో కూడిన సన్నివేశాలతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శ్రుతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం” అని అన్నారు. ఇందులో తాను పోషించిన శ్రుతి పాత్రకు తనకు 90 శాతం పోలికలున్నాయని, అందువల్ల ఆ పాత్ర పోషించడం పెద్ద కష్టం కాలేదని చెబుతూ, ఇందులో తన పాత్రను ప్రతి ఒక్కరూ తమతో పోల్చుకునే విధంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ రాశారని, శ్రుతి పాత్రలో చెల్లెళ్ళు, అమ్మలు, కూతుర్లు అందరూ తమని తాము చూసుకుంటారు” అన్నారు. ఈ యేడాదిలోనే నాగ చైతన్యతో ‘దూత’, సత్యదేవ్ 26వ చిత్రంలో తాను నటిస్తున్నానని, మరి కొన్ని కథలు వింటున్నానని ప్రియ భవాని శంకర్ తెలిపింది.