Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీలో దిల్ రాజు, అల్లు అరవింద్

Tollywood

Tollywood

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రధాన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ మూడు వర్గాల సభ్యులతో అత్యవసరంగా ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీల విధానంపై లోతైన చర్చలు జరిగాయి. లాభనష్టాల పంపకాల విషయంలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సున్నితమైన వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చే బాధ్యతను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు తమ భుజాలపై వేసుకున్నారు. సమస్యను లోతుగా అధ్యయనం చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం కోసం ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రత్యేక ‘సబ్-కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీకి.. వెటరన్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, కె.ఎల్. నారాయణ, మాజీ అధ్యక్షుడు దిల్ రాజు సలహాదారులుగా వ్యవహరించనుండగా, గౌరవ కార్యదర్శి కె. అశోక్ కుమార్ కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. వీరి పర్యవేక్షణలోనే కొత్త కమిటీ తమ కార్యాచరణను సాగించనుంది.

ఈ పర్సంటేజీల పంచాయితీలో ఎవరి వాదనలు వారు స్పష్టంగా వినిపించే అవకాశం కల్పించేలా, మూడు రంగాల (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) నుంచి సమానంగా ఏడుగురు చొప్పున మొత్తం 21 మంది సభ్యులతో ఈ స్పెషల్ సబ్-కమిటీని నియమించారు.

నిర్మాతల మండలి నుంచి: వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవిశంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్.కె.ఎన్ (SKN), టి. ప్రసన్న కుమార్.

ఎగ్జిబిటర్ల రంగం నుంచి: వి. ప్రతాప్ రెడ్డి, టి. బాలగోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాసరావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి.

డిస్ట్రిబ్యూటర్ల వర్గం నుంచి: డి. విష్ణుమూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, ఠాగూర్ మధు, ధీరజ్ మొగిలినేని. ఉన్నారు.

ఏర్పాటైన 21 మంది సభ్యుల కమిటీ ఈ పర్సంటేజీల చిక్కుముడిని ఎంత త్వరగా, ఎంత చాకచక్యంగా విప్పుతుందనే దానిపై యావత్ తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.