మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్థాపించిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఒక యువతి, సంస్థ తరపున పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు తనకు సినిమా అవకాశమిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుతో ఎర్నాకుళం సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువతి తెలిపిన వివరాల ప్రకారం, దినిల్ బాబు తనను “వేఫేరర్ ఫిలిమ్స్” తరఫున మాట్లాడుతున్నానని చెప్పి, తనకు ఒక కొత్త సినిమాలో అవకాశం ఇస్తానని నమ్మబలికాడట. కానీ తర్వాత అతని ప్రవర్తన దురుసుగా మారిందని, లైంగికంగా వేధించాడని ఆమె పోలీసులకు వివరించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మలయాళ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
Also Read : KGF 3: ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా..? ప్రశాంత్ నీల్ పోస్టు వైరల్
ఈ ఆరోపణలపై వేఫేరర్ ఫిలిమ్స్ తక్షణమే స్పందించింది. తమ అధికారిక ప్రకటనలో, దినిల్ బాబు తమ సంస్థ తో ఎలాంటి సంబంధం లేదని, ఆయన సంస్థ పేరు వినియోగించి ఇతరులను మోసం చేస్తున్నారని స్పష్టం చేసింది. అలాగే, ఆయన పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించింది. సంస్థ తరపున విడుదల చేసిన ప్రకటనలో, “మా సంస్థలో కాస్టింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అన్ని కాస్టింగ్ కాల్స్ మా అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారానే ప్రకటిస్తాము” అని స్పష్టం చేశారు. ఇక అభిమానులు, సినీప్రేమికులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “దుల్కర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి సంస్థకు ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే, సంస్థ నుంచి వచ్చిన స్పష్టత తర్వాత చాలా మంది దుల్కర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.