స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇందులోని ‘ఓహ్ సీతా…’, ‘ఇంతందం’ గీతాలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వీటిని పాడింది ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు పైనే అయ్యింది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఎలా పాడానో ఇప్పుడూ అలానే పాడాను. అయితే నాన్నగారు చనిపోవడంతో ఆయన చిన్నప్పటి వాయిస్ లా ఉందనే వ్యాఖ్య ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను. బహుశా వినేవాళ్ళ ధ్యాస నా మీదకు మళ్ళిందేమో అనిపిస్తోంది. అంతే తప్పితే ప్రత్యేకించి నాన్నగారిలా పడాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు” అని అన్నారు. తన తండ్రి మాత్రమే పాడదగ్గ పాటలు కొన్ని ఉంటాయని సంగీత దర్శకులు భావిస్తుంటారని, అయితే అలాంటి పాటలు తనకే రావాలనే ఆలోచన తనకెంత మాత్రం లేదని, తనకు వచ్చిన పాటలను మాత్రం శక్తి మేరకు పాడటానికి ప్రయత్నిస్తానని ఎస్పీ చరణ్ తెలిపారు. ‘సీతారామం’లోని పాటలకు కేకే చక్కని సాహిత్యం అందించారని, స్వచ్ఛమైన తెలుగు పదాలను ఉపయోగించారని, మెలోడీకి తగిన సాహిత్యాన్ని ఇచ్చారని ప్రశంసించారు.
సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ గురించి మాట్లాడుతూ, ”చాలా సెన్సిబిలిటీస్ వున్న సంగీత దర్శకుడు ఆయన. మెలోడి మీద కూడా మంచి పట్టు ఉంది. ఆయన ప్రోగ్రామింగ్ అద్భుతంగా వుంటుంది. లైవ్ మ్యూజిక్ కోసం ఆయన పడే తపన నాకు చాలా నచ్చింది. ఆయన్ని మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు. తెలుగులో తనకు ఒక్కసారిగా ఎందుకు అవకాశాలు తగ్గిపోయాయో తెలియదని చెబుతూ, ”మణిశర్మ, కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్… ఇలా అందరు సంగీత దర్శకుల దగ్గర నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి. జనాదరణ పొందాయి. అయితే తర్వాత ఎందుకు అవకాశాలు రాలేదో నాకైతే తెలీదు. ఫిల్మ్ ప్రొడక్షన్ బిజీ వల్ల పాడలేననే మాట నేను ఎన్నడూ చెప్పలేదు. రికార్డింగ్ కి ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారి నేను అందుబాటులో ఉన్నాను” అని అన్నారు. ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు నిర్మిస్తున్నానని, తెలుగులో చిత్ర నిర్మాణం ఇంకా మొదలు పెట్టలేదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రిలాగా సంగీత దర్శకత్వం వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని, సంగీతపరంగా ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని ఎస్పీ చరణ్ చెప్పారు.