ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఈ జీవో వర్తింప చేయకుండా ఒక పిరియడ్ తర్వాత అమలు చేస్తే బాగుంటుందని పలువులు సూచిస్తున్నారు. ప్రభుత్వ జీవో కి వ్యతిరేకంగా పెదవి విప్పే సాహసం ఏ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు, ప్రదర్శనదారుల చేయలేకపోతున్నారు.
టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కొందరు సి.ఎం. జగన్ సాయం చేయాలంటూ పరిశ్రమ బాగుకు సహకరించాలని అభ్యర్థించారు. ఇటీవల మంత్రి పేర్ని నానీ కూడా ఈ టిక్కెట్ ధరల పెంపు విషయమై సి.ఎం.తో మాట్లాడతానని వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోస్ విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు చిత్రరంగం కూడా అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు. అయితే సమయానుకూలంగా టికెట్ ధరల్ని పెంచకపోతే పరిశ్రమ చిక్కుల్లో పడుతుందని చిరంజీవి సహా పలువురు పెద్దలు చెబుతూ ఆ విషయంలో సాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. టికెట్ ధరలు ప్రభుత్వ నిర్ణయం మేరకే కొనసాగితే ఎగ్జిబిషన్ రంగం కోలుకోలేదని, ఏపీలో థియేటర్లు చాలా వరకు మూత పడతాయని చెబుతున్నారు.
వచ్చే సంక్రాంతి లోపు దాదాపు రూ.1000 కోట్లకు పైగా విలువ ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ యా సినిమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే ప్రదర్శించవలసిన పక్షంలో వందలాది కోట్లు నష్టపోవలసి వస్తుంది. అయితే ఈ నష్టం తారలకు కాదు. పంపిణీదారులు, ప్రదర్శనదారులు, కొంత మంది నిర్మాతలది. నటీనటులు ఎంతో కొంత తగ్గించుకున్నా (నిజానికి తగ్గించుకోవటానికి వారు ఇష్టపడరు) నష్టపోవడం మాత్రం గ్యారెంటీ. ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లు అమలు చేయాలంటే చిత్రపరిశ్రమ సమూలంగా మారాలి. తారలు పారితోషికంగా కొద్దిగా అడ్వాన్స్ తీసుకుని రిలీజ్ తర్వాత లాభాల్లో వాటాలు తీసుకోవాలి.
నిర్మాతలు ముందుగా తమ సొంత సొమ్ముని పెట్టుబడిగా పెట్టి (గోల్డెన్ ఎరాలో లా) సినిమాలు తీయాలి. ఎందుకంటే ప్రస్తుతం 99 శాతం నిర్మాతలు సొంత డబ్బుతో సినిమాలు తీయటం లేదు. మంది సొమ్ముతోనే తీస్తున్నారన్నది వాస్తవం. సొంత డబ్బుతో సినిమా తీసేటప్పుడు జాగ్రత్త వస్తుంది. వేస్ట్ ఖర్చులు ఉండవు. అదనపు ఖర్చులు కూడా తగ్గుతాయి. కథలను కూడా బడ్జెట్ తగ్గట్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదంతా జరుగుతుందా!? అంటే నిస్సందేహంగా జరగదు అనే చెప్పాలి. ఎందుకంటే మార్పు అంత తొందరగా రాదు. మరి ఈ టికెట్ రేటు విషయంలో మన స్టార్స్, స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు మూకుమ్మడిగా గొంతు విప్పుతారా? లేక పిల్లి మెడలో గంట కట్టేవాడి కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్ళదీస్తారా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.